ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

ఆడబిడ్డను గౌరవించడం మనందరి బాధ్యత: ప్రధాని మోదీ

అమ్మను పూజించడం మన సంప్రదాయమనీ.. దేశంలోని ప్రతి ఆడబిడ్డను గౌరవించడం మనందరి బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ఢిల్లీలోని ద్వారకలో డీడీఏ మైదానం వేదికగా జరిగిన రావణ దహనం కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఇదే వేదికగా ఆయన దేశ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అమ్మను పూజించే గడ్డ మనది. దేశంలోని ప్రతి ఆడబిడ్డను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. మన్‌కీ బాత్ సందర్భంగా కూడా నేను ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాను. ఆడపిల్లలు ‘లక్ష్మీ’దేవి స్వరూపాలనీ.. ఈ దీపావళి సందర్భంగా వారి విజయాలను వేడుకలా జరుపుకోవాలని నేను చెప్పాను..’’ అని ప్రధాని గుర్తుచేశారు.
 
కాగా దసరా వేడుకల సందర్భంగా రావణుడి బొమ్మపైకి మోదీ బాణం వేసి నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసుకున్నారు.

‘‘శ్రీ రామచంద్రుని ఆశీర్వాదాలు మనపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను. సత్యానికున్న బలం, మంచితనం, కరుణలదే ఎల్లప్పుడూ పైచేయి అవ్వాలి. చెడు నశించాలి. జైశ్రీరాం..’’ అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.