నేడు బైడెన్-పుతిన్ భేటీ
రష్యా, అమెరికా దేశాధినేతల కీలక భేటీ బుధవారం జెనీవాలో జరగనుంది. ఈ సమావేశం నుంచి పెద్దగా ప్రతిఫలాన్ని ఆశించొద్దని ఇరు దేశాల నేతలు పేర్కొంటున్నప్పటికీ ఏదో ఒక మిరాకిల్ జరగవచ్చన్న ఆశాభావాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా ఆధ్వర్యంలోని ఏక ధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందని, అన్ని దేశాలకు సమాన ప్రాతినిధ్యం వహించే బహుళ ధ్రువ ప్రపంచం దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పుతిన్ పేర్కొంటుండగా, ప్రపంచ ఆర్థిక, రాజకీయాలను శాసించేది రష్యా, చైనా కాదు, తామేనని బైడెన్ వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అమెరికా, రష్యాపట్ల వ్యూహాత్మక ఘర్షణ వైఖరిని అనుసరిస్తున్నది. అమెరికా ప్రపంచాధిపత్యాన్ని సవాల్ చేసేందుకు చైనాతో కలసి రష్యా వ్యూహాత్మక మైత్రిని పటిష్టపరచుకుంటున్నది. గత వారాంతంలో కార్నివాల్‌లో జరిగిన జి-7 దేశాల సదస్సు చేసిన సంయుక్త ప్రకటనలో రష్యాను హానికరమైన దేశంగా పేర్కొన్నది.
బుధవారం నాటి ముఖాముఖి సమావేశంలో నాటో, ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో అమెరికా జోక్యం గురించి పుతిన్ లేవనెత్తే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి ప్రతిగా బైడెన్ క్రిమియా అంశాన్ని ప్రస్తావించే అవకాశముంది.