బైడెన్‌కు ట్రంప్ లేఖ... అందులో ఏముందో తెలుసా?
చివరి వరకు జో బైడెన్ విజయాన్ని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్.. కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని మాత్రం కొనసాగించారు. శ్వేతసౌధాన్ని వీడుతూ ఓవల్ కార్యాలయంలో ఓ లేఖను విడిచి వెళ్లారు. ఈ విషయాన్ని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ వైట్ హౌస్ వద్ద మీడియాతో తెలిపారు.
కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని ట్రంప్ కొనసాగించడం సంతోషం అని ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడికి విషెస్ చెబుతూ.. ప్రెసిడెంట్‌కు మద్దతుగా ఉంటానని, ఆయన పదవీ కాలాన్ని ప్రశాంతంగా ముగించాలని కోరుకుంటున్నట్లు లేఖలో ట్రంప్ పేర్కొన్నారని సమాచారం.
బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ట్రంప్ హాజరుకాని విషయం తెలిసిందే. ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్ పెన్స్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కొన్ని గంటల ముందే ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వెళ్లిపోయారు. అధ్యక్ష హోదాలోనే ట్రంప్ నిష్క్రమణ జరగడం గమనార్హం. ఇక పటిష్టమైన భద్రతా నడుమ 78 ఏళ్ల జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 25వేల మంది నేషనల్ గార్డ్స్ పహారాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
నరేంద్ర మోదీ అభినందనలు
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు.
నమ్మకం ఆధారంగా భారత్-అమెరికా భాగస్వామ్యం కొనసాగుతోంది. మన ద్వైపాక్షిక బంధం ఎంతో దృఢమైనది. అమెరికాను నడిపించడంలో మీరు (బైడెన్) విజయవంతం కావాలని కోరుకుంటున్నా అని మోదీ పేర్కొన్నారు.