బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (15:34 IST)

రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఏక‌గ్రీవ‌ తీర్మానం చేయాలి: కేసీఆర్ కు భ‌ట్టి లేఖ

కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయ‌న రాసిన లేఖ‌ను మీడియాకు విడుద‌ల చేశారు.

బుధ‌వారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద భ‌ట్టి విక్ర‌మార్క మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తక్షణం శాస‌న‌స‌భ‌ను స‌మావేశ ప‌ర‌చి చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా తీర్మానం చేసి పంపాల‌ని లేఖ‌లో సిఎల్పీ పక్షాన కోరిన‌ట్లు చెప్పారు.

విద్యుత్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినట్లుగానే..  వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఆయ‌న లేఖ‌లో డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.

కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను మొద‌ట్లో వ్య‌తిరేకించిన కేసీఆర్‌... అందుకు అనుగుణంగా భార‌త్ బంద్ లో మంత్రులు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు పాల్గొన్నార‌ని అన్నారు. అయితే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వ‌చ్చాక‌.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై యూ ట‌ర్న్ తీసుకున్నార‌ని భ‌ట్టి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

కేసీఆర్ నిర్ణ‌యంతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళ‌న‌లో ఉంద‌ని లేఖ‌లో భ‌ట్టి పేర్కొన్నారు. వ్య‌క్తి గ‌త అవ‌స‌రాల కోసం రాష్ట్ర రైతాంగాన్ని మోదీ కాళ్ల ద‌గ్గ‌ర పెట్ట‌డం మంచిది కాద‌ని భ‌ట్టి మండిప‌డ్డారు. కొనుగోలు కేంద్రాన‌లు తొలగిస్తామంటే స‌హించేది లేద‌ని భ‌ట్టి విక్ర‌మార్క లేఖ‌లో తీవ్ర హెచ్చ‌రిక‌లు చేశారు.