సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:17 IST)

లక్ష ఇండ్లు ఎక్కడ?.. కేసీఆర్ మోసాలకు బలికావద్దు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష ఇండ్లు చూపిస్తానని సవాల్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. వాటిని చూపించలేక మేడ్చల్ జిల్లా నాగారం మునిసిపాలిటీ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారని భట్టి విక్రమర్క తీవ్రస్థాయిలో ఆరోపించారు.

లక్ష ఇండ్లు చూపిస్తానన్న మంత్రి తలసాని మొదటి రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొదటి రోజు కేవలం 3,248 ఇండ్లు మాత్రమే చూపించారని భట్టి అన్నారు. రెండోరోజూ మిగిలిన ఇండ్లను చూపిస్తానన్న మంత్రి.. గ్రేటర్ బయట రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాల్లోని మునిసిపాలిటిల్లో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూపించారని భట్టి ఆరోపించారు.

తుక్కుగూడ, నాగారం మునిసిపాలిటీలు గ్రేటర్ పరిధిలోనివి కాదన్న ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేకుండా పోయిందని బట్టి అన్నారు. చివరగా.. మేడ్చల్ జిల్లా నాగారం మునిసిపాలిటీలో ఇండ్లను చూపించి.. ఇంక మావల్ల కాదు, మీకు లిస్ట్ ఇస్తాం.. మీరే చూసుకోండని మంత్రి అనడం ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెడుతోందని అన్నారు.

లక్ష ఇండ్లను చూపించ లేక మంత్రి అర్థాంతరంగా మాకు పనులున్నాయి.. అని నాగారం నుంచి వెల్లిపోవడం.. లక్ష ఇండ్లను కట్టలేదన్న వాస్తవాన్ని అర్థం చేసిందని భట్టి అన్నారు. గ్రేటర్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టామని రాష్ట్ర శాసనసభలో ప్రగల్భాలు పలికే కేసీఆర్, కేటీఆర్ లు.. అంతిమంగా క్షేత్రస్థాయిలో ఇండ్లు చూపిస్తానన్న మంత్రి మాటలు నిజం కాదన్న విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమయిందని భట్టి అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేవలం 3,428 మాత్రమేనని భట్టి స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల సమయంలో నగరంలోని పేదలకు లక్ష ఇండ్లు పంపిణీ చేస్తామని అబద్దం చెప్పడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మరిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇండ్లు లేని పేదలను మోసం చేసి వారి ఓట్లతో అధికారాన్ని చెలాయించాలన్న కాంక్ష తప్ప వారికి నిజంగా మేలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మొత్తంగా కనీసం 6 వేల ఇండ్లు కూడా కేసీఆర్ ప్రభుత్వం కట్టలేదని... గ్రేటర్ పరిధి దాటినా కూడా మొత్తంగా 10 వేల ఇండ్లను చూపించలేకపోయారని భట్టి అన్నారు.

కేసీఆర్, కేటీఆర్ లక్ష ఇండ్లు ఎక్కడ? ఎంతకాలమీ మోసం? అని భట్టి ఈ సందర్భంగా ఆగ్రహంగా ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ లోని పేదల బస్తీలన్నీ తిరుగుతాం.. ప్రజలకు వాస్తవాలు చెబుతామని భట్టి అన్నారు. అలగే కేసీఆర్ చేసిన మోసాలకు వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు భట్టి పిలుపునిచ్చారు, 
 
రాబోయో గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పి.. కాంగ్రెస్ గెలిపించుకుందాని భట్టి చెప్పారు. ఈ సందర్భగానే ఆయన ప్రభుత్వ డబ్బుతో మన ఇండ్లను మనమే నిర్మించుకుందామన్న నినాదాన్ని ప్రజలకు ఇచ్చారు.