శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (14:44 IST)

సజీవదహనం చేస్తామంటూ కత్తి కార్తీకకు బెదిరింపులు..

బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీకకు కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. సజీవదహనం చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆమె రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఆమెకు దుండగులు బెదించడానికి గల కారణాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక సిట్టింగ్ శాసనసభ్యుడు రామలింగారెడ్డి (తెరాస) ఇటీవల కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార తెరాసతో పాటు.. విపక్ష పార్టీలు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇలాంటివారిలో కత్తి కార్తీక ఒకరు. 
 
ఈమె దుబ్బాక ఉప ఎన్నిక బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని భావిస్తున్నారు. అయితే ఆమెకు తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. కార్తీక డ్రైవర్ ఇజాజ్ షరీఫ్‌ను కొందరు వ్యక్తులు బెదిరించారు. కార్తీక దుబ్బాకలో పోటీ చేస్తే ఆమెను సజీవదహనం చేస్తామంటూ వారు హెచ్చరించారు.
 
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కార్తీక రామాయంపేట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. తన కారు డ్రైవర్ ఇజాజ్ షరీఫ్ హైదరాబాద్ నుంచి దుబ్బాక వస్తుండగా, రామాయంపేట వద్ద గుర్తుతెలియని దుండగులు అటకాయించారని తెలిపారు. ఇన్నోవా వాహనంలో వచ్చిన ఆ వ్యక్తులు దుబ్బాకలో పోటీ చేయవద్దని తనకు చెప్పాలని తన డ్రైవర్‌ను బెదిరించారని ఆరోపించారు.
 
స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఓ మహిళను గౌరవించే విధానం ఇదేనా? అని కార్తీక ప్రశ్నించారు. కాగా, ఆమె ఫిర్యాదు నేపథ్యంలో రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.