మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (21:01 IST)

ఇన్ఫోసిస్ సీఈవో - సీఎఫ్‌వోలు అలాంటి వారా?

ఇన్ఫోసిస్ సీఈవో, సీఎఫ్‌వోలపై గుర్తు తెలియని వ్యక్తులు సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ గత కొన్ని నెలలుగా అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఇన్ఫోసిస్ బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను గత సెప్టెంబరు 20వ తేదీన రాయగా, ఈ లేఖలోని సారాంశాన్ని కొన్ని మీడియా సంస్థలు తాజాగా వెలుగులోకి తెచ్చాయి. 
 
ఇన్ఫోసిస్ సీఈవోగా సలీల్ ఫరేక్, సీఎఫ్‌వోగా నిలంజన్ రాయ్‌లు ఉన్నారు. వీరిద్దరూ గత కొన్ని నెలలుగా అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. పరేఖ్, రాయ్ అనేక త్రైమాసికాలుగా అనైతిక పద్ధతులను అవలంభిస్తున్నారు. దానికి సంబంధించి ఈమెయిల్, వాయిస్ రికార్డింగ్ రూపంలో ఆధారాలు ఉన్నాయి అని లేఖలో పేర్కొన్నట్టు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. 
 
అయితే, వీరిద్దరిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఫిర్యాదుదారుల్లోని ఓ ప్రజావేగు అమెరికాలోని విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం కార్యాలయానికి అక్టోబరు మూడో తేదీన మరో లేఖ రాశారు. గత రెండు త్రైమాసికాలుగా ఉద్దేశ్యపూర్వకంగ తప్పుడు లెక్కలు చూపారు అని అందులో పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్లు కుప్పకూలాయి. 
 
మరోవైపు, ఈ ఆరోపణలపై ఇన్ఫోసిస్ కంపెనీ స్పందించింది. ప్రజావేగు ఫిర్యాదుల్ని ఆడిట్ కమిటీ ఎదుట ఉంచుతామని ప్రకటించింది. కంపెనీ ప్రజావేగు నిబంధనల ప్రకారం దీన్ని పరిష్కరిస్తామని వెల్లడించింది.