గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (11:15 IST)

ఆన్‌లైన్ క్లాసుల కోసం ప్రత్యేక ఫీజులు.. స్నాక్స్‌, ట్రాన్స్‌పోర్ట్ లేకపోయినా..?

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పరీక్షలు రద్దు అయ్యాయి. దీంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాదులోని పలు ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులకు శ్రీకారం చుట్టాయి. అయితే.. ఈ క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 
 
అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల కోసం ప్రత్యేక ఛార్జ్‌ చెల్లించమని స్కూలు యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ట్రాన్స్‌పోర్ట్, యాక్టివిటీస్, స్నాక్స్‌ లేకున్నా చార్జ్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. 
 
ప్రస్తుతం నగరంలో ఆన్‌లైన్‌ విధానంలో బోధన కొనసాగిస్తున్న పలు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ బోధిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజులు సహా, ఇతర యాక్టివిటీస్, ఫుడ్‌ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పేరెంట్స్‌ ఆందోళన చెందుతున్నారు.  
 
కోవిడ్‌ కలకలం నేపథ్యంలో తిరిగి పాఠశాలలను ఎప్పుడు తెరుస్తారో స్పష్టత లేని నేపథ్యంలో పూర్తిస్థాయిలో పాఠశాలలు పనిచేసే పరిస్థితి లేదు. తిరిగి స్కూల్స్‌ పునః ప్రారంభమైన సమయంలో మిగితా త్రైమాసిక ఫీజులను పాత పద్ధతిలో వసూలు చేయాలని స్కూలు యాజమాన్యాలు భావిస్తున్నాయి. తొలి త్రైమాసికానికి ఫీజులు లాగేసేందుకు స్కూల్ యాజమాన్యులు సిద్ధమైనాయి.  
 
విద్యార్థుల నుంచి తాము వసూలు చేసే ఫీజుల్లో రాయితీ ప్రకటిస్తే తాము తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని పాఠశాలల యాజమాన్యాలు అంటున్నాయి. ఉపాధ్యాయుల వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు, వాహనాల మరమ్మతులు, వాటి ఈఎంఐలు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది జీతభత్యాలు తడిసి మోపడవుతున్న నేపథ్యంలో ఫీజుల్లో రాయితీలు ఇవ్వలేమని చెప్తున్నాయి. విద్యార్థుల తల్లిండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది.