స్కూల్ ఫీజు : ప్రైవేట్ స్కూల్స్‌కు ఏపీ సర్కారు ఆర్డర్స్... తేడా వస్తే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ తర్వాత కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. అంటే జూన్ రెండో వారం నుంచి పాఠశాలలు ప్రారంభంకావాల్సివుంది. అపుడు విద్యార్థుల నుంచి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజు దండకాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన ఏపీ సర్కారు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
లాక్‌డౌన్ తర్వాత ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంచేసింది. అది కూడా, తొలి విడత ఫీజును రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఏ విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించరాదంటూ ఈ మేరకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అదీకూడా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి గత యేడాది అంటే 2019-20 విద్యా సంవత్సరంలో వసూలు చేసిన ఫీజునే వసూలు చేయాలని కోరింది.
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఆదేశాలు జారీచేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంగా చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇపుడు ఈ కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేరింది.