కరోనా రక్కసి గుప్పెట్లో కర్నూలు - కొత్తకా మరో 31 కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కరోనా రక్కసి గుప్పెట్లో చిక్కుకున్నట్టుగా ఉంది. తాజాగా మరో 31 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఈ కేసులన్నీ బయటపడ్డాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో ఏకంగా 80 కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
కొత్తగా నమోదైన 80 కేసుల్లో ఒక్క కర్నూలులోనే 31, గుంటూరులో 18, చిత్తూరు జిల్లాలో 14, అనంతపురంలో 6, తూర్పు గోదావరి జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 2, విశాఖ జిల్లాలో ఒక కేసులు నమోదయ్యాయని వివరించింది. దీంతో రాష్ట్రంలో కరోనా 893కి చేరింది.
కొన్ని రోజులుగా ఏపీలో కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఏపీలో నమోదవుతున్న కేసుల్లో 46 శాతానికి పైగా కేసులు ఈ రెండు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం.
మరోవైపు, రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వివరించారు. ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 27కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 725గా ఉంది. 141 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
జిల్లా వారీగా నమోదైన కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 42, చిత్తూరు 73, ఈస్ట్ గోదావరి 32, గుంటూరు 195, కడప 51, కృష్ణా 88, కర్నూలు 234, నెల్లూరు 67, ప్రకాశం 50, విశాఖపట్టణం 22, వెస్ట్ గోదావరి 39 చొప్పున నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.