తండ్రి శవం సమీపానికిరాని కొడుకు - భార్య ... తలకొరివి పెట్టిన తాహసీల్దారు
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఓ తాహసీల్దారు మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్ సోకి మరణించిన తండ్రికి తల కొరివి పెట్టేందుకు కన్నబిడ్డ నిరాకరించాడు. దీంతో తాహసీల్దారు మానవత్వం చాటుకున్నాడు. తాను ముందుకు వచ్చిన తలకొరివి పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్‌లోని శుజల్‌పూర్ నివాసికి పక్షవాతం రావడంతో ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏప్రిల్ 14న పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
దీంతో అధికారులు అతన్ని చిరాయులోని ప్రభుత్వ దవాఖానకు తరలించి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. వారం రోజులు ఐసోలేషన్‌లో చికిత్స పొందిన బాధితుడు ఏప్రిల్ 20న మృతిచెందడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానిక శ్మశాన వాటికకు రావాలని సూచించారు.
అనంతరం మృతదేహాన్ని తీసుకుని అధికారులు శ్మశానికి చేరుకున్నారు. మృతుడి భార్య, కొడుకు, బావమరిది కూడా అక్కడికి వచ్చారు. అయితే శ్మశానం దాకా వచ్చిన కుటుంబసభ్యులు కొరివి పెట్టేందుకు మాత్రం నిరాకరించారు.
అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు పట్టించుకోలేదు. పీపీఈ కిట్స్ తెప్పించినా వేసుకునేందుకు సమ్మతించలేదు. కనీసం మృతదేహం సమీపానికి కూడా రాలేదు. తనకు ఒక్కడే కొడుకని వాడి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడం తనకు ఏమాత్రం ఇష్టం లేదనీ మృతుని భార్య చెప్పడం ఇక్కడ గమనార్హం.
దీంతో చేసేదేమీ లేక స్థానిక తహసీల్దార్ కొరివి పెట్టేందుకు ముందుకొచ్చాడు. కుటుంబసభ్యులు పట్టించుకోకున్నా తనకు ఏ సంబంధం లేని వ్యక్తికి కొరివి పెట్టి మానవత్వం చాటుకున్నాడు.