శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2020 (20:14 IST)

వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు

వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.డి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌదరరాజన్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో యూనివర్సిటీ రిజిస్ట్రార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసంవత్సరం లోగా సిలబస్‌ను పూర్తి చేసే విధంగా  ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన మేరకు యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో ఆన్లైన్ తరగతుల పురోగతిపై  ఆమె నేడు సమీక్షించారు.
 
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ యూజీ మెడికల్, డెంటల్, ఆయూష్, నర్సింగ్, పారా మెడికల్ కోర్సులకు సంబంధించి దాదాపు యాభై మూడు వేల మంది విద్యార్థులు ఉన్నారని, అన్ని కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామని గవర్నర్‌కు వివరించారు. 
 
కరోనా దృష్ట్యా ఫ్యాకల్టీ ఆసుపత్రులలో బిజీ ఉండటం వల్ల ఆన్లైన్ తరగతులు నిర్వహించడంలో కొంతవరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. అయినా విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలని లక్ష్యంతో ఫ్యాకల్టీ పనిచేస్తోందని అన్నారు.  క్లాసెస్ నిర్వహించి విద్యార్థుల నుండి ఫీడ్‌బ్యాక్ రిపోర్ట్ అందజేయాలని కళాశాలలకు ఆదేశించామని, విద్యా సంవత్సరం నష్టపోకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.