శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జులై 2021 (12:27 IST)

మయన్మార్‌లో ఉద్రిక్తత.. 25మంది మృతి.. 11 మందికి పైగా గాయాలు

మయన్మార్‌లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలు ఆయుధాలు చేతబట్టుకుని సైనికులపై తిరగబడుతున్నారు. తాజాగా రాజధాని నెపిడాకు సుమారు 300 కి.మీ. దూరంలోని డెపాయిన్ టౌన్‌లో శుక్రవారం సైనికులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్శణలో 25మంది మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.
 
‘సాయుధులైన టెర్రరిస్టులు’ అక్కడ గస్తీ తిరుగుతున్న సైనికులపై ఒక్కసారిగా దాడి చేశారని, ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించగా ఆరుగురు గాయపడ్డారని ప్రభుత్వ ఆధీనంలోని ‘గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్’ పత్రిక తెలిపింది. 
 
దేశంలో మిలిటరీ పాలనను వ్యతిరేకిస్తున్నవారు ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్’ పేరిట తామే ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని స్వయంగా రైఫిల్స్ వంటి ఆయుధాలను తయారు చేసుకుంటున్నారు. దేశంలో పలు చోట్ల ఈ సంస్థ సభ్యులు సైనికులపై దాడులకు పాల్పడుతున్నారని ఈ పత్రిక పేర్కొంది.
 
అయితే స్థానికుల కథనం మరోలా ఉంది. ఈ టౌన్ లో నాలుగు సైనిక ట్రక్కుల్లో వచ్చిన సాయుధ దళాలు.. నిర్దాక్షిణ్యంగా.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని ..చివరకు రోడ్డున ఎవరు కనిపిస్తే వారిపై కూడా ఫైర్ చేశారని తీవ్ర గాయాలకు గురైన ఓ వ్యక్తి తెలిపాడు. 
 
ఈ ఘటనలో తన సమీప బంధువు మరణించినట్టు ఆయన చెప్పాడు. సైనికులు కొందరి తలలపై రైఫిల్ ఆనించి ఫైర్ చేశారన్నాడు. కాల్పుల అనంతరం 25 మృతదేహాలను కనుగొన్నారు. కాగా డెసాయిన్ పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రం..తమ సభ్యుల్లో 18 మంది మరణించారని.. 11 మందికి పైగా గాయపడ్డారని తన ఫేస్‌బుక్‌లో తెలిపింది.