ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జులై 2021 (14:00 IST)

ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కూప్పకూలిన సైనిక విమానం...

ఫిలిప్పీన్స్‌లో ఓ సైనిక విమానం కుప్పకూలింది. ఈ విమాన ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. మొత్తం 85 మంది సైనికులు సహా 92 మందితో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఈ ఘటనలో ఇప్పటి వరకు 45 మందిని రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నట్టు ఆర్మీ చీఫ్ సిరిలిటో సొబెజనా తెలిపారు. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ఈ ఘటన జరిగిందని. విమానం రన్‌వేను చేరుకోవడంలో విఫలం కావడంతోనే ప్రమాదం జరిగినట్టు ఆయన వివరించారు.
 
ప్రమాదానికి గురైన సి-130 విమానంలోని సైనికులు ఇటీవలే ప్రాథమిక సైనిక శిక్షణను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. దుర్ఘటన జరిగిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన సంయుక్త బృందంలో వీరిని చేర్చేందుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
విమానంలో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కూడా ఉన్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి డెల్ఫిన్ లోరెంజానా తెలిపారు. కాగా, విమానం కూలిన జోలో ద్వీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి.