ప్రజలే సర్వాధికారులు.. కోర్టులను ప్రభుత్వాలు శాసించరాదు : జస్టిస్ ఎన్వీ రమణ
ప్రజలే సర్వాధికారులు అని, ప్రభుత్వాలు కోర్టులను శాసించరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, అణచివేసే నిరంకుశ ప్రభుత్వాలు రాకుండా కొన్నేళ్లకోసారి జరిగే ఎన్నికలు అడ్డుకోలేవని, అలాంటి హామీ ఏదీ లేదని వ్యాఖ్యానించారు.
అయితే, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రజాభిప్రాయాలను ఎల్లప్పుడూ ప్రభుత్వాలు వినాలని హితవు చెప్పారు. బుధవారం సాయంత్రం జస్టిస్ పి.డి. దేశాయి 17వ స్మారకోపన్యాసంలో భాగంగా రూల్ ఆఫ్ లా (న్యాయాధికారం) అనే అంశంపై ఆయన మాట్లాడారు.
అందులో భాగంగా ఇప్పటివరకు దేశంలో జరిగిన 17 సార్వత్రిక ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో 8 సార్లు ప్రభుత్వాలను ప్రజలు మార్చారని గుర్తుచేశారు. దేశంలో భారీగా అసమానతలు, పేదరికం, వెనుకబాటుతనం ఉన్నా.. ప్రజలు తెలివైనవారేనని, వారు తమ పనిని సంపూర్ణంగా నిర్వహించారని ఈ ఎన్నికలే నిరూపిస్తాయన్నారు. ఆ ఎన్నికల్లో ప్రజలందరూ హేతుబద్ధంగా వ్యవహరించారని చెప్పారు.
కోర్టులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని సీజేఐ రమణ అన్నారు. ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు కోర్టులను శాసించరాదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు లేదా అధికారులు.. కోర్టులను ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ నియంత్రించ కూడదు. అలా జరిగినప్పుడు న్యాయాధికారం అన్నది ఓ భ్రమలా మారుతుంది అని ఆయన అన్నారు.
స్వేచ్ఛ, సమానత్వం, కుటుంబం, న్యాయం వంటి వాటిపై స్పృహ పెరిగే కొద్దీ న్యాయాధికారం కూడా మారిపోతూ వస్తోందని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు మహమ్మారి సమయంలో సామాన్యుల జీవితాలను కాపాడేందుకు ఆ న్యాయాధికారాన్ని ఎంత వరకు వాడుకున్నారన్నదానిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మహమ్మారి అంతం ఇక్కడితో అయిపోలేదని అన్నారు. రాబోయే దశాబ్దాల కాలంలో మరిన్ని పెద్ద సంక్షోభాలకు ఇది ఓ తెర లాంటిదని హెచ్చరించారు. కాబట్టి ఈ మహమ్మారి సంక్షోభ సమయంలో మనం ఏది కరెక్ట్ గా చేశాం? ఏ విషయంలో తప్పు చేశాం? అనే విషయాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.