బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఈ పని అపుడే చేసివుంటే మెంటల్ మామ అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదు : లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడాన్ని పలువురు విపక్ష నేతలు స్వాగతిస్తున్నారు. దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షసక్రీడకు సుప్రీంకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టిందన్నారు. 
 
రెండు నెలల పోరాటం తర్వాత వైఎస్ జగన్ గారు దిగొచ్చి పరీక్షలు రద్దు చేయడం సంతోషమన్నారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
 
'మొండిపట్టుదలకు పోకుండా ఏప్రిల్ 18న నేను మొదటి లేఖ రాసినప్పుడే పరీక్షలు రద్దు చేసి ఉంటే విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయం ఉండేది. మానవత్వంతో ఆలోచించి ఉంటే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంత మానసిక ఆందోళన ఉండేది కాదు... మెంటల్ మామ అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదు' అని వ్యాఖ్యానించారు. 
 
సీఎం జగన్ జగన్ మరోమారు తుగ్లక్ అని నిరూపించుకున్నారనీ, తన తుగ్లక్ నిర్ణయాలతో రెండు నెలల పాటు విద్యార్థులను హింసించారని లోకేశ్ విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానంతో చీవాట్లు తినే పరిస్థితి మరోసారి తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రతిపక్షం అడిగే న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని జగన్ గారిని కోరుతున్నాను చెప్పుకొచ్చారు.