ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (16:16 IST)

పంతాలు పట్టింపులకు పోవద్దు.. జగన్‌కు ట్రిపుల్ ఆర్ హితవు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై ఆయన ఓ లేఖ రాశారు. పరీక్షల నిర్వహణలో పంతాలు పట్టింపులకు పోవద్దని కోరారు. బోర్డు పరీక్షల రద్దుపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. 
 
ఇప్పటికైనా సుప్రీంకోర్టు చెప్పినట్టు నడుచుకోవాలని హితవు పలికారు. పంతాలు, పట్టింపులకు పోకుండా తక్షణమే పరీక్షలు రద్దు చేయాలని, తద్వారా విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. పరీక్షల నిర్వహణ అంశంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని సుప్రీంకోర్టు శంకించిందన్న విషయాన్ని గమనించాలని కోరారు. 
 
కొత్తగా కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పడం శోచనీయం అని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. 
 
పరీక్షలు రద్దు చేసినట్టు ప్రకటిస్తే సుప్రీంకోర్టుకు తగిన గౌరవం ఇచ్చిన వారవుతారన్నారు. మంచి నాయకుడని నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం అని సీఎం జగన్మోహన్ రెడ్డికి స్పష్టంచేశారు.
 
ఇప్పటికే దేశంలో 18 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయని, ఆ రాష్ట్రాల బాటలో పయనిస్తే విద్యార్థుల భవిష్యత్ కాపాడిన వారవుతారని హితవు పలికారు.
 
పీసీఏ చైర్మన్‌గా విశ్రాంత జడ్జి జస్టిస్ కనగరాజ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ కు లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు గురువారమే రాష్ట్రంలో పరీక్షల అంశాన్ని ప్రస్తావిస్తూ మరో లేఖ సంధించడం గమనార్హం.