సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (19:21 IST)

అన్‌లాక్ దిశగా రాష్ట్రాలు - కేంద్ర ఆందోళన

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అనేక రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలును సడలిస్తున్నాయి. ముఖ్యంగా, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్‌ను ఎత్తివేస్తున్నాయి. అలాగే, మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ చర్యపై కేంద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 
 
క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షించి, అంతా సక్రమంగా ఉన్నాయని నిర్ధరించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు పలు సూచనలు చేస్తూ లేఖలు రాసింది. 
 
ఈ ఆంక్షల సడలింపుల వల్ల కొన్ని రాష్ట్రాల్లో మార్కెట్లు రద్దీగా మారిపోతాయని, దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. సంతృప్తితో చతికిలపడకుండా చూసుకోవడం చాలా అవసరమని హోంశాఖ పేర్కొంది. 
 
కోవిడ్ ఉద్ధృతిని అత్యంత జాగరూకతతో గమనించి, ఆయా కార్యకలాపాలు అత్యంత జాగ్రత్తగా పునఃప్రారంభమయ్యేలా చూసుకోవాలని కూడా కోరింది. అలాగే పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో అవసరమైన కట్టడి చర్యలను తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. 
 
మరోవైపు, కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోవాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెచ్చరించారు. కరోనా నిబంధనలను పాటించడంలో అలసత్వం వద్దని అన్నారు. 
 
లాక్డౌన్ నిబంధనలను సడలించడాన్ని అలుసుగా తీసుకోవద్దని... విహారయాత్రలు చేయవద్దని చెప్పారు. నిబంధనలను సడలించారని విచ్చలవిడిగా ప్రయాణాలను ప్రారంభిస్తే... మళ్లీ 15 రోజుల పాటు లాక్డౌన్ విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 
కాగా, మహారాష్ట్రలో విడతల వారీగా లాక్డౌన్‌ను సడలిస్తున్న సంగతి తెలిసిందే. రెండో విడతలో భాగంగా పూణెలో లాక్డౌన్‌ను సడలించారు. ఈ సందర్భంగా పూణెలో పరిస్థితిని అజిత్ పవార్ సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.