మిల్కాసింగ్ గుర్తుగా నల్లబ్యాండ్లు ధరించి ఆడుతున్న టీమిండియా క్రికెటర్లు!
ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కరోనాతో మృతి చెందిన భారత పరుగుల వీరుడు, ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ గౌరవార్థం భారత క్రికెటర్లు నల్ల బ్యాండ్‌లను ధరించి మ్యాచ్ ఆడుతున్నారు. మిల్కాసింగ్ భారత క్రీడా రంగానికి ఎంతో సేవ చేయడంతో పాటు ఆయన జీవితం ప్రపంచ క్రీడాకారులు అందరికి ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే.
కాగా మే 20న కరోనా వైరస్ బారిన పడిన మిల్కాసింగ్.. మహమ్మారితో పోరాడి ఓడాడు. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మిల్కాసింగ్ అప్పట్లో గుర్తింపు పొందారు. 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో అంచనాలకి మించి రాణించిన మిల్కా సింగ్ స్వర్ణం గెలిచారు. 1956, 1960, 1964 ఒలిపిక్స్‌లోనూ భారత్‌కి మిల్కాసింగ్ ప్రాతినిథ్యం వహించాడు.
భారత ప్రభుత్వం ఈ దిగ్గజ అథ్లెట్‌ని పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్ చేరిన మిల్కాసింగ్.. నాలుగో స్థానంలో నిలిచారు. కేవలం 0.1 సెక్లన తేడాతో పతకం చేజార్చుకున్నారు. కానీ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన తొలి భారత పురుష అథ్లెట్‌గా అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేశారు.
మిల్కా సింగ్ తన కెరీర్‌లో 80 పోటీల్లో పాల్గొనగా 77 సార్లు విజయం సాధించారు. ఒక 10 ఏళ్ల పాటు మిల్కా సింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌ను ఏలారు. ఒక కామన్వెల్త్ పతకంతో పాటు నాలుగు ఆసియన్ క్రీడల బంగారు పతకాలు గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో 1956లో సాధించిన రికార్డు మళ్లీ 2014 వరకు చెక్కు చెదరలేదు. అలాంటి గొప్ప క్రీడాకారుడు మరణించడంపై దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను విషాదంలో నింపింది.