మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (12:07 IST)

భారత క్రికెటర్లను కించపరిచింది నిజమే... క్రికెట్ ఆస్ట్రేలియా

తమ దేశంలో క్రికెట్ సిరీస్ ఆడేందుకు వచ్చిన భారత క్రికెటర్లను తమ దేశ అభిమానులు కించపరిచిన మాట నిజమేనని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ముఖ్యంగా, టీమిండియాపై ఆస్ట్రేలియా పౌరులు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించింది. ఈ విషయంలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉందన్నారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 
 
సిడ్నీలో ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్ట్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్‌ను, జస్ ప్రీత్ బుమ్రాను ఆసీస్ అభిమానులు కొందరు హేళన చేసిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని కెప్టెన్ అజింక్య రహానే, మరికొందరు అంపైర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఫిర్యాదును నమోదు చేసిన ఐసీసీ పలువురిని ప్రశ్నించింది.
 
ఈ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. భారత ఆటగాళ్లను గేలి చేసిన మాట వాస్తవమేనని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ విభాగం హెడ్ సీన్ కారోల్ వెల్లడించారు. ఈ విషయంలో తమ సొంత విచారణ కూడా సాగుతోందని, అందుబాటులోని సీసీటీవీ ఫుటేజ్‌లను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన మ్యాచ్‌కి సంబంధించిన టికెట్ల విక్రయం వివరాలు కూడా సేకరించామన్నరు.
 
ఈ జాతి విద్వేష వ్యాఖ్యలకు కారకులెవరన్న విషయాన్ని తేల్చేందుకు సమీపంలో కూర్చుని ఉన్న ప్రేక్షకులను విచారిస్తున్నామని, ఏది ఏమైనా క్రికెట్ ఆస్ట్రేలియా యాంటీ హెరాస్‌మెంట్ కోడ్ ఉల్లంఘన జరిగిందని ఇప్పటికే తేల్చామని, ఎన్ఎస్‌డబ్ల్యూ పోలీసుల సహకారంతో నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.