బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం
బీహార్ తరహాలోనే దేశ వ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ యేడాది అక్టోబరు - నవంబరు నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనర్హులైన ఓటర్లను తొలగించేందుకు తనిఖీలు చేపట్టే అధికారం ఈసీకి ఉందని, అది దాని రాజ్యాంగ కర్తవ్యమని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన సంగతి తెల్సిందే.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమీక్ష, తనిఖీ రాజ్యాంగవిరుద్ధమని, ఓటర్ల ఓటు హక్కును హరించేదిగా ఉందంటూ వివిధ ప్రతిపక్షాలు వేసిన పిటిషన్‍పై ఈ తరహా వ్యాఖ్యలు చేసింది.
ఈ నెల 28న ఆ పిటిషన్‌పై మరోసారి విచారణ జరుగనుంది. ఆ తర్వాత వచ్చే నెలలోనే దేశవ్యాప్తంగా ఈ తనిఖీలు నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసే వీలున్నట్టు తెలుస్తోంది.
ముందుగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన అస్సాం, కేరళ, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఈ ప్రక్రియ చేపడతారు. విపక్షాలు పిటిషన్ వేసిన మర్నాడే అంటే ఈ నెల 5న జాబితాల సమీక్షకు సన్నాహాలు మొదలు పెట్టాలని ఆదేశిస్తూ ఈసీ అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారు(సీఈవో)లకు లేఖ రాసింది.
వచ్చే యేడాది జనవరి ఒకటో తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని.. 18 ఏళ్లు నిండినవారికి ఓటు హక్కు కల్పించాలని స్పష్టం చేసిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా, బీహార్‌లో చేపట్టిన తనిఖీల్లో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారికి ఓటు హక్కు ఉన్నట్టు గుర్తించి విషయం తెల్సిందే.