మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (08:02 IST)

అంగారక గ్రహంపై జీవం ఉండేదా? నాసా అద్భుత వీడియో

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వివిధ గ్రహాల పరిశోధనలు చేస్తూ వస్తోంది. ఇందులోభాగంగా, అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది నిర్ధారించడానికి 'పర్సెవరెన్స్‌' రోవర్‌‌ను పంపించింది. ‘పర్సెవరెన్స్’‌ రోవర్‌ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగింది. ఈ రోవర్ అంగారగ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది. 
 
మూడు నిమిషాల ఇరవై ఐదు సెకన్ల నిడివిగల ఈ వీడియోలో 'పర్సెవరెన్స్‌' అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్‌ అయిన క్షణాలు ఈ వీడియోలో రికార్డు అయ్యాయి. రోవర్‌ ల్యాండవుతున్న సమయంలో అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం, తాళ్ల సాయంతో వ్యోమనౌక నుంచి రోవర్‌ కిందకి దిగడం, శాస్త్రవేత్తలు చప్పట్లతో హర్షించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 
 
ఈరోవర్‌లో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లును ఇంజినీర్లు అమర్చారు. రోవర్‌ ల్యాండింగ్‌ సమయంలో రికార్డు చేయడానికి 7 కెమెరాలను ఇంజినీర్లు స్విచ్‌ ఆన్‌ చేశారు. రానున్న కొద్ది రోజుల్లో రోవర్‌ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు, వీడియో రికార్డింగ్‌లను వెలువరిస్తామని చెప్పిన మూడు రోజులకే నాసా తాజాగా ఈ వీడియో విడుదల చేసింది.