గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (08:52 IST)

గాజాలోని శరణార్థ శిబిరంలో అగ్నిప్రమాదం.. మూడు తరాలవారు సజీవదహనం

gaza home fire
గాజాలోని శరణార్థ శిబిరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్టుమెంటులో చిన్నారి పుట్టిన రోజు వేడుక రోజున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలవారు ఉన్నారు. మృతుల్లో ఏడుగురు చిన్నారుల కూడా ఉన్నారు. 
 
గాజాలోని ఓ శరణార్థ శిబిరంలో ఆనందంగా జరుపుకుంటున్న పుట్టనరోజు వేడుక చివరకి విషాదంగా మిగిలింది. ఈ భవనంలో ఉన్నట్టుండి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం తుడిసిపెట్టుకునిపోయింది. పుట్టిన రోజుల వేడుకలు జరుగుతున్న భవనంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వీటిలో చిక్కుకుని ఏకంగా 21 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 
 
మూడు అంతస్తులన్న భవనంలో అబు రయా అనే వ్యక్తి కుటుంబం ఉంటుంది. ఈయన కుటుంబంలోని ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఈజిప్టు నుంచి తమ బంధువు కూడా వచ్చాడు. దీంతో ఈ వేడుకలను వారంతా కలిసి ఆనందంగా జరుగుతున్నారు. 
 
ఈ క్రమంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకునిపోయింది. మూడు తరాలకు చెందిన ప్రజలు సజీవదహనమయ్యారు. ఇంట్లో అధిక మొత్తంలో నిల్వచేసిన పెట్రోల్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుంటుందని స్థానికులు భావిస్తున్నారు.