గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (10:30 IST)

ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో నేపాల్ అధ్యక్షుడు అడ్మిట్

ramachandra powdel
నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ మరోమారు ఆస్పత్రి పాలయ్యారు. ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. గత నెల రోజుల వ్యవధిలో ఆయన ఆస్పత్రిపాలు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 
 
గత కొన్ని రోజులుగా శ్వాస పీల్చడంలో కష్టంగా అనిపించడంతో పౌడెల్‌ను తొలుత ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్శిటీ బోధనా ఆస్పత్రికి తరలించారు. ఆక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను బుధవారం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 
 
నేపాల్ అధ్యక్షుడు ఛాతిలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా భారత్‌కు తరలించినట్టు అధ్యక్షుడి మీడియా సలహాదారు కిరన్ పోఖరెల్ తెలిపారు. ఆయనతో వెంట కుమారుడు చింతన్ పౌడెల్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
కాగా, అధ్యక్షుడు త్రిభువన్ ఆస్పత్రిలో ఉండగా ప్రధాని పుష్పకుమార్ దహాల్, ఉప ప్రధాని, రక్షణ మంత్రి పూర్ణ బహదూరు ఖడ్కా, ఇతర నేతలు కలిసి పరామర్శించారు. కడుపునొప్పితో బాధపడిన అధ్యక్షుడు పౌడెల్ ఈ నెల ఒకటో తేదీన తొలి ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే.