శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2019 (18:50 IST)

అత్యాచార ఆరోపణలు.. నేపాల్ స్పీకర్ రాజీనామా..

నేపాల్ స్పీకర్ తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపులు, అత్యాచారానికి సంబంధించిన ఆరోపణలే ఇందుకు కారణం. లైంగిక వేధింపుల ఆరోపణలతో నేపాల్ స్పికర్ కృష్ణ బహదూర్ మహరా తన పదవికి రాజీనామా చేశారు. మహారా తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ శివమయకు సమర్పించారు. నేపాల్ పార్లమెంట్‌లోని సెక్రటేరియట్ భవన్‌లో పని చేస్తున్న మహిళ ఉద్యోగిని తనను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, అత్యాచారం చేశారని స్పీకర్‌పై ఆరోపణలు చేసింది.
 
సెప్టెంబర్ 23న తాను ఒంటరిగా ఉన్నప్పుడు మహారా తన అద్దె ఇంటికి వచ్చినట్టు ఉద్యోగిని తెలిపింది. అయితే తన ఇంటికి వచ్చినప్పుడు మద్యం మత్తులో ఉన్నాడని పేర్కొంది. మద్యం మత్తులో ఉన్న మహారాను ఇంట్లోకి రానీయకుండా చాలాసేపు ప్రయత్నించానని.. చాలాసేపటికి ప్రతిఘటించానని చెప్పుకొచ్చింది. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన స్పీకర్ అసభ్య పదజాలంతో దూషించాడని వివరించింది. 
 
మహారా తనకు చాలా సంవత్సరాలుగా తెలుసని చెప్పిన ఆమె గతంలో కూడ చాలా సార్లు తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు చేసింది. స్పీకర్ మహారాపై వచ్చిన ఆరోపణలపై నేపాల్ కమ్యూనిస్టు పార్టీ చర్చించేందుకు సోమవారం సమావేశమైంది. అత్యాచార ఆరోపణలపై విచారణ నిష్పాక్షికంగా జరిపేందుకు పదవి నుండి తప్పుకోవాలని సూచించింది. దీంతో స్పీకర్ మహారా మంగళవారం స్పీకర్ పదవికి రాజీనామా చేశారు.