బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (07:52 IST)

కండరాల నొప్పులకు సరికొత్త మసాజ్

ఒకప్పుడు వళ్లు నొప్పులంటే కల్లుప్పుని వేడి చేసి కాపడం పెట్టే వాళ్లు. లేదా ఏదైనా ఆయిల్‌తో నొప్పి ఉన్న ప్రాంతంలో బాగా మర్దనా చేసి వేడి నీళ్ల కాపడం పెట్టే వాళ్లు. మళ్లీ ఇప్పుడు ఆ పాత పద్దతులనే అనుసరిస్తున్నారు కానీ సరికొత్తగా. మసాజ్‌లో భాగంగా ఏకంగా ఒంటి మీద మంటపెడుతున్నారు.

దీని ద్వారా నొప్పులన్నీ తగ్గిపోతాయంటున్నారు. దీన్నే ఫైరీ టెక్నిక్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఇది ఈజిప్ట్‌కు చెందిన మసాజ్. అబ్దుల్ రహీమ్ సయీద్ అనే ఈజిప్టియన్ మసాజర్ ఈ పురాతన టెక్నిక్‌‌ని ఉపయోగించి క్షణాల్లో కండరాల నొప్పులను తగ్గిస్తున్నాడు.

నీలే డెల్టా గవర్నేట్ ఆప్ ఘార్బేయాలో నివసిస్తున్న సయీద్ తన దగ్గరకు వచ్చే బాధితులకు మంటలతో మసాజ్ చేస్తున్నాడు. ఇది ఒక పురాతన పారోనిక్ టెక్నిక్. దీన్ని ఫైరీ టవల్‌గా పిలుస్తుంటారు. అంటే మంటలతో మసాజ్ చేస్తారు. మసాజ్ చేసే సమయంలో ఒంటికి చేమంతి జాతికి చెందిన హెర్బల్ ఆయిల్‌ని పట్టిస్తారు.

తరువాత నొప్పి ఉన్న ప్రాంతంలో ఆల్కహాల్‌ చల్లిన టవల్ కప్పి మంట వెలిగిస్తారు. వేడి తగిలి కండరాల నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. మసాజ్ చేయించుకునే వ్యక్తి బోర్లా పడుకుంటే అతడిపై 5 లేక 6 మందంగా ఉన్న టవల్స్‌ని కప్పుతారు. పైన ఉంచిన టవల్ మీద ఆల్కహాల్ చల్లుతారు. వెంటనే నిప్పు వెలిగిస్తాడు.

ఒక నిమిషం పాటు టవల్ అలానే వుంచుతారు. ఆతరువాత తడి టవల్‌తో మంటను ఆర్పేస్తారు. ఈ ఫైరీ టవల్ మసాజ్ వలన శరీరంలోని తేమను పీల్చుకుని త్వరగా నొప్పులు తగ్గుతాయని సయీద్ చెబుతున్నాడు.

అయితే అధిక రక్తపోటు లేదా కిడ్నీ ఫెయిల్యూర్, హీమోఫీలియాతో బాధపడేవారికి ఈ మసాజ్ చేయమని సయీద్ చెబుతున్నాడు. మసాజ్ చేయించుకున్న వారు నొప్పులు వంద శాతం తగ్గాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.