సోమవారం, 4 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (09:48 IST)

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్‌ నేతృత్వం!

Muhammad Yunus
బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం తలెత్తింది దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. దీనికి ఆ దేశానికి నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి ఆ దేశ ఆర్మీ అధికారికంగా ఓ ప్రకటన జారీచేసింది. అదేసమయంలో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్‌ను సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్థరాత్రి సమయంలో ఆయన ప్రకటన వెలువరించారు. 
 
యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా సేవలందించి, బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం కృషిచేశారు. చిట్టగాంగ్‌లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థిక వేత్త. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను పొందారు. 
 
పార్లమెంటును రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్‌లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరునూ వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కారును, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. హసీనా సర్కారుతో ఘర్షణపడినందుకు యూనస్‌పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఆరు నెలల జైలుశిక్ష పడింది. తన దేశం, ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు.