శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (11:37 IST)

ఇమ్రాన్ అరెస్టుతో పాకిస్థాన్‌‍లో అస్థిరత.. భారీగా పడిపోయిన కరెన్సీ విలువ

Money
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో దాయాది దేశంలో ఒక్కసారిగా అశాంతి వాతావరణం నెలకొంది. అరెస్టు తర్వాత దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఘర్షణలను నియంత్రించేందుకు ప్రభుత్వం.. సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పతనమైంది.

గురువారం నాటి ట్రేడింగులో డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి మారకం విలువ 3.3 శాతం పడిపోయి 300 వద్ద జీవనకాల కనిష్ఠానికి తగ్గిపోయింది. అలాగే, 2031తో ముగియనున్న డాలర్ బాండ్ల విలువ అమాంతం పెరిగి 33.44 శాతానికి చేరింది.

అల్ ఖదీర్ భూ కుంభకోణం కేసులో ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌‍ను పాకిస్థాన్ పోలీసులు ఇస్లామాబాద్ హైకోర్టు పరిధిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అవినీతి నిరోధక కోర్టు ఆయనకు 8 రోజుల కస్టడీ విధించింది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలో అల్లర్లు చెలరేగడంతో ఆందోళనలను అడ్డుకునేందుకు పాక్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. దీంతో పాక్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ పీకల్లోతు ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకునిపోయింది. నిత్యావసర ధరలు భగ్గుమనడంతో తిండి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు విదేశీ మారకపు నిల్వలు కూడా అడుగంటిపోతున్నాయి. అటు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రస్తుతం పెండింగు ఉన్న 6.5 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు పాక్ చర్చలు జరుపుతున్నా అవి ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా కన్పించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ అరెస్టుతో పాక్ రణరంగంగా మారింది. దేశ పరిస్థితులు కూడా మరింతగా దిగజారిపోయాయి.