చైనా టీకా వేసుకున్న పాకిస్థాన్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి వీవీఐపీ వరకు ఈ వైరస్ సోకుతోంది. ఇటీవలే పాకిస్థాన్ ప్రధానమంత్రి ఈ వైరస్ బారినపడ్డారు. ఇపుడు ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా మహమ్మారి బాధితుల జాబితాలో చేరారు.
ఆరిఫ్ అల్వీకి కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని వెల్లడైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నానని, కానీ శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందాలంటే రెండో డోసు తప్పనిసరి అని వివరించారు.
మరో వారంలో రెండో డోసు తీసుకోవాల్సి ఉందని, ఈలోపే కరోనా సోకిందని ఆరిఫ్ అల్వీ విచారం వ్యక్తం చేశారు. అయితే, ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా చైనా తయారీ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత కరోనా బారినపడ్డారు. కరోనా సోకినప్పటికీ తన మీడియా బృందంతో సమావేశం నిర్వహించి విమర్శలపాలయ్యారు.