గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (11:45 IST)

మోదీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు రాసిన లేఖలో ఏముంది?

పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఒక లేఖ రాశారు. "ఒక పొరుగు దేశంగా ఇండియా ఎల్లప్పుడూ పాకిస్తాన్ ప్రజలతో స్నేహపూర్వక సంబంధాన్ని కోరుకుంటుంది. ఇందుకోసం ఉగ్రవాదం, శతృత్వం లేని నమ్మకం, విశ్వాసంతో కూడిన వాతావరణం అవసరం. కోవిడ్ 19 మహమ్మారితో పోరాడుతూ, సవాళ్లను అధిగమిస్తున్న క్లిష్ట సమయంలో మీకు, పాకిస్తాన్ ప్రజలకు నా అభినందనలు" అని మోదీ ఆ లేఖలో రాశారు.

 
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా పాకిస్తాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేశ రాష్ట్రపతి ఆరిఫ్ అల్వికి లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దగ్గర తాజాగా కాల్పుల విరమణ అమలు అవుతున్న సమయంలో మోదీ, ఇమ్రాన్ ఖాన్‌కు ఈ లేఖ రాశారు. కొన్ని నెలల కిందట, రెండు దేశాల్లోని మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను అమలు చేయనున్నట్లు తెలిపారు.

 
ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా చేసిన ఒక ప్రకటనలో.. ఇరు దేశాలూ పాత విషయాలను మర్చిపోయి ముందుకు నడవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, సింధు నదీ జలాల పంపకం విషయమై పాకిస్తాన్ ఇండస్ వాటర్ కమిషనర్ సయ్యద్ మెహర్-ఎ-ఆలం నేతృత్వంలో ఎనిమిది మంది బృందం, భారత బృందంతో దిల్లీలో చర్చలు జరపనున్నారు. రెండేళ్ల తరువాత ఈ చర్చలు జరగనున్నాయి.

 
ఈ మధ్య కాలంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఏర్పడుతున్న స్నేహపూర్వక సంబంధాల వెనుక మూడో దేశం జోక్యం ఉండి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇండియా, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి సౌదీ అరేబియా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి ఆదిల్ అల్ జుబైర్ మాటల ద్వారా తెలుస్తోంది.

 
ఇటీవల అరబ్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సౌదీ అరేబియా ఈ ప్రాంతం మొత్తంలో శాంతిని కోరుకుంటోందని, అందుకు తగిన ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు కొన్ని వార్తాపత్రికలు కూడా పేర్కొన్నాయి. అయితే, ఈ విషయాలను భారత్, పాకిస్తాన్‌లు ధ్రువీకరించనప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న స్నేహ సంబంధాలకు ఇదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.