మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (17:05 IST)

అధికారం కోసం కాంగ్రెస్ ఎంత నిజానికైనా దిగజారుతుంది : ప్రధాని మోడీ

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికైనా దిగజారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆదివారం అసోంలోని బోకాఖత్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 
 
అసోం విషయంలో ఆ పార్టీ అన్నీ బూటకపు హామీలు ఇస్తోందని మండిపడ్డారు. అటు కేంద్రంలో, ఇటు అసోంలో ఆ పార్టీ అధికారంలో ఉండగా.. భద్రత, స్థిరత్వం విషయంలో విఫలమైందన్నారు. 
 
అధికారం కోసం ఆ పార్టీ ఎంత నీచానికైనా దిగజారుతుందని మోడీ విమర్శించారు. అబద్ధపు హామీలు ఇచ్చేందుకూ వెనకాడదన్నారు. అందుకు ఆ పార్టీ మేనిఫెస్టోనే ఉదాహరణ అని గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్ హయాంలో అసోం రెట్టింపు నిర్లక్ష్యానికి గురైందన్నారు. రాష్ట్రంలో అవినీతి రెట్టింపైందని, చొరబాట్లు రెట్టింపయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాంగ్రెస్ పార్టీ అంటేనే ‘అబద్ధాలు.. అయోమయం.. అవినీతి.. హింసాత్మక’ పార్టీ అని మండిపడ్డారు. మహిళా సాధికారత, ఉద్యోగాల కల్పన విషయంలో ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. 
 
రెండు ఇంజన్ల ఎన్డీయే ప్రభుత్వం అసోం అభివృద్ధికి శతవిధాలా కృషి చేసిందని మోదీ చెప్పారు. దేశంతో అసోంను కలిపిందన్నారు. ఎన్నో అభివృద్ధి పనులను చేసిందన్నారు. మరో ఐదేళ్లలో అభివృద్ధిలో అసోం దూసుకుపోతుందని హామీ ఇచ్చారు.
 
ప్రస్తుతం ఆ పార్టీ ఖజానా ఖాళీ అయిందని, దానిని నింపుకోవడం కోసం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆరాట పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసోంలో బాంబు పేలుళ్లు, తుపాకుల సంస్కృతి, హింస ఎప్పుడు అంతమవుతుందో అని ప్రజలు అనుకునేవారని మోడీ గుర్తు చేశారు. 
 
అదంతా బీజేపీ హయాంలోనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం అసోంలో శాంతి, స్థిరత్వం వచ్చిందన్నారు. స్మగ్లర్లకు కాంగ్రెస్ కొమ్ముకాసిందని మోదీ విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రైనోల స్మగ్లింగ్‌ను అడ్డుకుందని చెప్పారు. స్మగ్లర్లను జైల్లో పెట్టామన్నారు. ఆక్రమణదారుల చెర నుంచి కజిరంగ పార్కును రక్షించామని ప్రధాని మోడీ చెప్పకొచ్చారు.