శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (09:31 IST)

దీదీజీ.. నా తలను తన్నండి.. అంతేగానీ : ప్రధాని మోడీ

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సూచన చేశారు 'దీదీ (మమతాబెనర్జీ).. మీరు నా తలపై కాలు పెట్టండి..! నా తలను తన్నండి.. నేను అభ్యంతరం చెప్పను. కానీ, బెంగాలీల కలలను తన్నకండి. బెంగాల్‌లో అభివృద్ధిని మీరు ఆపలేరు' అని వ్యాఖ్యానించారు. 
 
ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆదివారం ప్రధాని మోడీ బంకురలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల టీఎంసీ ప్రచురించిన ప్రచార పోస్టర్లలో.. ప్రధాని నరేంద్ర మోడీ తలపై మమతాబెనర్జీ కాలు పెట్టినట్లు ఉండేలా ఓ కార్టూన్ వేశారు. దీనికి ప్రధాని కౌంటర్ ఇచ్చారు. బెంగాలీల కలలను తన్నే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని సున్నితంగా హెచ్చరించారు.
 
అలాగే, ఈవీఎంల పనితీరుపై మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేయడంపైనా ప్రధాని స్పందించారు. 'దీదీ తన ఓటమిని ముందే గ్రహించారేమో..! అందుకే ఆమె ఈవీఎంలను శంకిస్తున్నారు. పదేళ్ల క్రితం ఆమె అవే ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మర్చిపోయినట్లున్నారు' అని చురకలంటించారు. 
 
పదేళ్లుగా ఉత్తుత్తి హామీలకే పరిమితమయ్యారని విమర్శించారు. తమది స్కీముల ప్రభుత్వమని, మమతది స్కాముల సర్కారు అంటూ మండిపడ్డారు. 'ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం-కిసాన్‌, నగదు బదిలీ వంటి కేంద్ర పథకాలను మమత ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఎందుకంటే.. ఆయా పథకాల్లో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. టీఎంసీ నాయకులకు ఎలాంటి కమీషన్లు ఉండవు' అని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. 
 
మరోవైపు, ఈ ఎన్నికల కోసం బీజేపీ సంకల్ప్ పత్ర పేరుతో ఓ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో జరగనున్నాయి. బెంగాల్ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలన్న దృఢనిశ్చయంతో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోల్ కతాలో విడుదల చేశారు.
 
బీజేపీ మేనిఫెస్టో ముఖ్యాంశాలు...
* బెంగాల్ రైతులకు ఏటా రూ.4 వేల ఆర్థికసాయం
* కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఏటా రూ.10 వేలు అందజేత
* శరణార్థుల కుటుంబాలకు ఏటా రూ.10 వేల ఆర్థికసాయం
* 70 ఏళ్లుగా బెంగాల్లో ఉంటున్న వారికి పౌరసత్వం
* 33 శాతం ఉద్యోగాలు మహిళలకు కేటాయింపు
* రాష్ట్రంలో బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
* మత్స్యకారులకు ఏటా రూ.6 వేల ఆర్థికసాయం
* బెంగాల్లో మూడు చోట్ల ఎయిమ్స్ ఆసుపత్రులు
* రూ.11 వేల కోట్లతో 'సోనార్ బంగ్లా' నిధి ఏర్పాటు
* రూ.22 వేల కోట్లతో కోల్ కతా అభివృద్ధి నిధి 
* రూ.1000 కోట్లతో సరికొత్త టూరిజం పాలసీ
* రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు
* క్రీడల అభివృద్ధికి రూ.2000 కోట్లు
* ఐఐటీలు, ఐఐఎంలకు దీటైన 5 యూనివర్సిటీల స్థాపన
* ఆశా వర్కర్ల కనీసం వేతనం రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంపు