మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:19 IST)

పాకిస్థాన్‌లో భీతవహ స్థితి.. శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా

కరోనా వైరస్ దెబ్బకు పాకిస్థాన్ అల్లకల్లోలంగా మారనుంది. ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా భీతావహ పరిస్థితి నెలకొంది. పాక్‌లో కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 2,238 కాగా, మరణాలు 31కి పెరిగాయి.
 
ప్రస్తుతం పాకిస్థాన్‌లో క్లిష్టపరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రకటించలేని నిస్సహాయ స్థితిలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని ప్రభుత్వం ఉంది. పైగా ఆ దేశ ప్రజలు ప్రభుత్వం విధించే ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎవరూ ఊహించలేని స్థాయికి చేరుకోవచ్చన్న అంచనాలకు బలం చేకూరుస్తోంది. 
 
పైగా ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాల లేమి తీవ్రంగా ఉంది. తగినంత స్థాయిలో స్క్రీనింగ్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం పాక్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా మారింది. పైగా, పాక్షిక లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కేసులు రెట్టింపయ్యాయి. మరికొన్నిరోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగనుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
 
దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా మసీదులు ఇప్పటికీ మూతపడలేదు. ఇప్పటికే ఇరాన్, సౌదీ అరేబియా మసీదులను మూసివేసినా, పాకిస్థాన్‌లో మసీదుల్లో ఇప్పటికీ ప్రార్థనలు జరుగుతున్నాయి. గత నెలలో పాకిస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి 2.50 లక్షల మంది హాజరయ్యారని అంచనా. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన వారి వివరాలు తెలుసుకోవడం పట్ల పాక్ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి కనబర్చుతోంది.