సౌదీలో కర్ఫ్యూ అమలు.. ఉల్లంఘిస్తే రూ.2 లక్షల అపరాధం
కరోనా మహమ్మారిపడిన దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. నిజానికి సాధారణ రోజుల్లోనే ఈ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటిది, భూగోళాన్ని కరోనా వైరస్ కబళించిన నేపథ్యంలో అమలు చేసే ఆంక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆదివారం ఒక్కరోజే సౌదీలో ఏకంగా 119 కొత్త కేసులు నమోదు కావడం ఆ దేశంలో ఈ వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. సోమవారం కూడా దేశవ్యాప్తంగా 51 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో సౌదీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 562కి చేరింది.
దీంతో ఆ దేశ రాజు సల్మాన్ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. అయితే, ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు అక్కడి సర్కార్ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ సోమవారం సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చింది.
మార్చి 23 సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతి రోజు(21 రోజుల పాటు) కర్ఫ్యూ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ఈ 11 గంటల కర్ఫ్యూ సమయంలో ఎవరైతే ఆంక్షలను ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు ఉంటాయని తాజాగా అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 10 వేల రియాల్స్(రూ.2లక్షల 2వేలు) జరిమానాతో పాటు జైలుకి కూడా వెళ్లాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే, ఈ కర్ఫ్యూ నుంచి వైద్య రంగానికి చెందిన ఉద్యోగులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది, దేశ సైన్యానికి మినహాయింపు ఇచ్చింది. ఈ కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో దేశ పౌరులతో పాటు ప్రవాసులు కూడా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు.