బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (13:32 IST)

తెలంగాణాలో మూడు కొత్త కేసులు.. కర్ఫ్యూ అమలుకు కేంద్రం సూచన?

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 36కి చేరింది. జర్మనీ నుంచి వచ్చిన హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన మహిళలకు కరోనా నిర్ధారణ అయింది. సౌదీ అరేబియా నుంచి బేగంపేటకు వచ్చిన మరో మహిళకు కరోనా ఉన్నట్లు తేలింది. అలాగే లండన్‌ నుంచి వచ్చిన కూకట్‌పల్లి వాసికి కూడా కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఈ ముగ్గురుని ఆస్పత్రికి తరలించి క్వారంటైన్‌లో చికిత్స అందిస్తున్నారు. అలాగే, వారి కుటుంబ సభ్యులను కూడా హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే, ఈ లాక్‌డౌన్ ఆంక్షలను ప్రజలు యధేచ్చగా ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నీరుగారిపోయే అవకాశాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.
 
లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను జారీచేసింది. అవసరమైతే చట్ట ప్రకారం కర్ఫ్యూని విధించాలని సూచించింది. కర్ఫ్యూ అమల్లోకి వస్తే... ఎవరూ కూడా రోడ్లపై కనిపించడానికి కూడా వీలుండదు. ఎవరైనా రోడ్లపైకి వస్తే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.