గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (07:48 IST)

వణికిస్తున్న కరోనా మహమ్మారి.. 30 రాష్ట్రాలు లాక్‌డౌన్...

ప్రపంచంతో పాటు.. మన దేశాన్ని కూడా మహమ్మారి కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా దేశంలో 30 రాష్ట్రాలతో పాటు.. కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తిగా లాక్‌డౌన్ ప్రకటించాయి. అలాగే, దేశంలో వైరస్ కేసుల సంఖ్య దాదాపుగా 500కు చేరుకోగా, ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 10కి చేరింది. 
 
సోమవారం ఒక్కరోజే గరిష్టంగా కేరళలో 28 కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, గుజరాత్‌లో 12, తమిళనాడులో 2, బిహార్‌లో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో రెండు కేసులు నమోదయ్యాయి. 
 
కాగా, దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 30 రాష్ట్రాల్లో మొత్తం 548 జిల్లాలు ఉండగా, ఈ జిల్లాలన్నింటిలోనూ పూర్తిస్థాయి లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. 
 
ఢిల్లీలో ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయని వెల్లడించారు. 
 
కరోనా బాధితుల కోసం ఆసుపత్రులను సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరుతున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 500 కేసులు నమోదయ్యాయని, 23 మంది డిశ్చార్జి అయ్యారని, 10 మంది మృతి చెందారని తెలిపారు.
 
దేశవ్యాప్తంగా 15000 కేంద్రాల్లో నమూనాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. కరోనా పరీక్షా కేంద్రాలకు మార్గదర్శకాలు రూపొందించామని, ప్రైవేట్ సంస్థలకు కరోనా పరీక్షలకు అనుమతిస్తే పరీక్షల రుసుం రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య మాత్రమే ఉండాలని సూచించారు.
 
ఇంకోవైపు,  కరోనా నివారణ కోసం లాక్‌డౌన్ విధించినా ప్రజలు తమ సూచనల మేర నడుచుకోవడంలేదని ఏపీ ప్రభుత్వం అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. 
 
ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు కొనుక్కునేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబం నుంచి ఒకరు మాత్రమే వచ్చి కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. 
 
సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిగా షట్ డౌన్ విధిస్తున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకూడదని ఆదేశించింది. హోటళ్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే పార్శిళ్లు తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది.