శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (07:33 IST)

నిర్మానుష్యంగా శ్రీవారి మాడవీధులు.. రాత్రివేళల్లో క్రూరమృగాల సంచారం?!

నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ సందడిగా ఉండే తిరుమల గిరులు ఇపుడు బోసిబోయికనిపిస్తున్నాయి. భక్తులు లేక ఏడుకొండలు వెలవెలబోతున్నాయి. పైగా, రాత్రి సమయాల్లో క్రూరమృగాలు సంచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తుల రాకను తితిదే పాలక మండలి నిలిపివేస్తూ సంచలాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఏడుకొండలు బోసిబోయి కనిపిస్తున్నాయి. పైగా, శ్రీవారి నిలయం ఇలా నిర్మానుష్కంగా కనిపించడం గత 128 యేళ్ళలో ఇదే తొలిసారి అని చరిత్రపుటలు చెబుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కరోనా భయం కారణంగా భక్తుల రాకను అడ్డుకోవడంతో కొన్నిరోజులుగా తిరుమల క్షేత్రం బోసిపోయినట్టు కనిపిస్తోంది. నిత్యం భక్తజనసందోహంతో కోలాహలంగా ఉండే మాడవీధులు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న తిరుమల వీధుల్లో క్రూరమృగాలు సంచరిస్తున్నాయి. 
 
రాత్రివేళల్లో కల్యాణవేదిక, నారాయణగిరి, ముల్లగుంట ప్రాంతాల్లో చిరుతపులులు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టు గుర్తించారు. జంతువుల సంచారంతో విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల కొండపై ఉన్న స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎవరూ బయట తిరగవొద్దని అధికారులు విజ్ఞప్తిచేశారు.