ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (07:39 IST)

ఒక మహిళకు ఎంతమందైనా భర్తలు... సౌతాఫ్రికాలో గ్రీన్ పేపర్

ఒక మహిళకు ఎంతమందైనా భర్తలు ఉండొచ్చా? ప్రపంచ దేశాల్లో ఈ వింత ఆచారం ఎక్కడా లేదు. కానీ, ఆఫ్రికా దేశాల్లో ఒకటైన సౌతాఫ్రికాలో మాత్రం ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం ఓ గ్రీన్ పేపర్‌ను సిద్ధం చేసింది. 
 
ప్రపంచంలో అత్యంత ఉదారమైన రాజ్యాంగ వ్యవస్థలు కలిగిన దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉన్నాయి. తాజాగా బహుభర్తృత్వంపై వచ్చిన ప్రతిపాదనలనూ ఆ దేశ ప్రభుత్వం స్వీకరించింది.
 
ఇష్టమొచ్చినన్ని పెళ్లిళ్లు చేసుకునే స్వేచ్ఛ మగవారికి ఉన్నప్పుడు ఒకరిని మించి భర్తలను పొందే స్వేచ్ఛ మహిళలకు ఎందుకుండొద్దు? అంటూ దక్షిణాఫ్రికాలో మహిళలు, పురుషులకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
 
దేశంలోని మహిళలు ఒకరిని మించి పురుషులను పెళ్లాడేందుకు 'చట్టబద్ధమైన అనుమతులు' ఇవ్వడాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలతో ఓ ఫైలును సిద్ధం చేసింది. దీన్నే ఆ దేశంలో 'గ్రీన్‌ పేపర్' అంటారు. 
 
ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు ఆ దేశ హోంమంత్రిత్వశాఖ, ఈ గ్రీన్‌ పేపర్‌ను జారీ చేసింది. అయితే బహుభర్తృత్వ ప్రతిపాదనలను అక్కడి సంప్రదాయవాదులు, కొన్ని మతసంస్థల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.