గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (08:28 IST)

వేధిస్తున్న ఇంధన కొరత - శ్రీలంకలో అందరికీ వర్క్ ఫ్రమ్ హోం

Srilanka-PM
శ్రీలంక దేశాన్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో ఆ దేశంలో పని చేసే ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించారు. గత కొంతకాలంగా శ్రీలంక తీవ్రమైన ఆర్థికసంక్షోభంలో కూరుకునిపోయింది. దీంతో ఇంధన కొరత కూడా ఉత్పన్నమైంది. 
 
ఇంధనాన్ని దిగుమతి చేసుకునే స్తోమత లేక వినియోగాన్ని భారీగా తగ్గించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు వరకు అత్యవసర సేవలు మాత్రమే పనిచేస్తాయని, మిగిలిన అన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (సీపీసీ) అత్యవసర సర్వీసులకు మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేస్తుందని తెలిపింది. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఆరోగ్య సేవలు, ఆహార సరఫరా, వ్యవసాయం వంటివి అత్యవసర సేవల్లో ఉన్నాయని రవాణా శాఖ మంత్రి బండులా గుణవర్ధనేని ఉటంకిస్తూ న్యూస్‌ఫస్ట్‌.ఎల్‌కే వెబ్‌పోర్టల్‌ వెల్లడించింది. 
 
'మిగిలిన అన్ని రంగాలు ఖచ్చితంగా ఇంటి నుంచి పనిచేసేందుకు సిద్ధమవ్వాలి' అని మంత్రి స్పష్టం చేశారు. ఇంధన వినియోగాన్ని కనీసస్థాయికి తగ్గించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతివ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.