ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 2 జూన్ 2022 (21:11 IST)

శ్రీలంక: తక్షణం వరి సాగు చేయండి.. ఎక్కువ ధాన్యం పండించండి - రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి

crop
శ్రీలంక, గత 70 ఏళ్లకు పైగా కాలంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, వరిని ఎక్కువగా పండించాలని రైతులను కోరుతోంది. దేశంలో ఆహార పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్నందున రైతులంతా ఎక్కువగా వరి పంటను సాగు చేయాలని దేశ వ్యవసాయ మంత్రి అభ్యర్థించారు. ఆహారంతో పాటు నిత్యావసరాల తీవ్ర కొరత కారణంగా ధరల పెరుగుదల రేటు కొత్త రికార్డులను తాకింది.

 
చమురు, ఆహారం సహా కీలకమైన వస్తువుల కొనుగోళ్లకు చెల్లించడానికి ప్రభుత్వం మంగళవారం పన్నులను పెంచింది. 2.2 కోట్ల జనాభా ఉండే శ్రీలంక, కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతింది. విదేశీ కరెన్సీ కొరత, పెరుగుతోన్న ద్రవ్యోల్బణంతో దేశంలో మందులు, చమురు ఇతర నిత్యావసరాల కొరత ఏర్పడింది. ''దేశంలో ఆహార పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందనేది స్పష్టంగా తెలుస్తోంది'' అని జర్నలిస్టులతో శ్రీలంక వ్యవసాయ మంత్రి మహింద అమరవీర చెప్పారు.

 
''రాబోయే అయిదు నుంచి 10 రోజుల్లో రైతులంతా పొలాలకు వెళ్లి వరిని సాగు చేయాలని మేం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం'' అని ఆయన అన్నారు. ఆగస్టుకల్లా తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే హెచ్చరించినందున... శ్రీలంక అధికారులు, ఆహార ఉత్పత్తిని పెంచే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. దక్షిణాసియా ఆహార బ్యాంకు మద్దతు కోసం కూడా శ్రీలంక దరఖాస్తు చేస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ న్యూస్ పేపర్ నివేదించింది. దక్షిణాసియా ఆహార బ్యాంకు అవసరాల్లో ఉన్న దేశాలకు బియ్యం, ఇతర వస్తువులను సరఫరా చేసింది.

 
''ఆహార బ్యాంకు సహాయం కోసం సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి)ను అడిగే ప్రక్రియను మా శాఖ ఇప్పుడే మొదలు పెట్టింది'' అని ఒక ఇంటర్వ్యూలో ఫుడ్ కమిషనర్ జె.కృష్ణమూర్తి చెప్పారు. శ్రీలంక దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ఆహారాన్ని విరాళాల రూపంలో లేదా సబ్సిడీ విక్రయాల ద్వారా అందుకోవాలని చూస్తున్నట్లు కృష్ణమూర్తి తెలిపారు. దక్షిణాసియాలోని 8 దేశాల సమూహం 'సార్క్'. ఇందులో భారత్, శ్రీలంక కూడా ఉన్నాయి. దీనిపై వ్యాఖ్య కోసం శ్రీలంక ఫుడ్ కమిషనర్ల విభాగం, సార్క్‌లను బీబీసీ సంప్రదించగా వారు వెంటనే స్పందించలేదు.

 
మంగళవారం శ్రీలంక ప్రభుత్వం తక్షణమే వ్యాట్‌ను 8 నుంచి 12 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వానికి 179.9 మిలియన్ డాలర్ల (రూ. 1394 కోట్లు) అదనపు ఆదాయం లభిస్తుందని భావిస్తున్నారు. అక్టోబర్‌లో కార్పొరేట్ పన్ను కూడా 24 శాతం నుంచి 30 శాతానికి పెరుగుతుందని తెలిపింది. వ్యాట్‌ను పెంచాల్సిన అవసరం ఉందని ఈ ఏడాది ప్రారంభంలో అప్పటి శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సార్బీ, బీబీసీకి చెప్పారు.

 
దేశానికి వచ్చే 8 నెలల్లో నిత్యావసర వస్తువుల దిగుమతుల కోసం 4 బిలియన్ డాలర్లు (రూ. 31,002 కోట్లు) అవసరమని ఆయన అన్నారు. శ్రీలంక ద్రవ్యోల్బణం రేటు గత ఏడాది నుంచి చూస్తే మే నెలలో రికార్డు స్థాయిలో 39.1 శాతానికి పెరిగినట్లు మంగళవారం నాటి అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. గత రికార్డు 29.8 శాతం కాగా దీన్ని ఏప్రిల్‌లోనే అధిగమించింది. ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. వస్తువులను కొనడానికి గతంలో కంటే ఎక్కువ డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది.

 
శ్రీలంక, చరిత్రలోనే తొలిసారిగా గతనెలలో డీఫాల్టర్‌గా మారింది. 78 మిలియన్ డాలర్ల (రూ. 604 కోట్లు) వడ్డీని నిర్ణీత గడువులోగా చెల్లించడంలో విఫలమైంది. ప్రభుత్వాలు, రుణదాతలకు సకాలంలో అప్పులు తిరిగి చెల్లించలేకపోతే డీఫాల్టర్‌గా మిగిలిపోతాయి. డీఫాల్టర్‌గా మారితే దేశం ప్రతిష్ట దెబ్బతింటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో అవసరమైన డబ్బును అప్పుగా పొందడం కష్టం అవుతుంది. దేశ కరెన్సీ, ఆర్థికవ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.