సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (20:17 IST)

శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణం

Ranil Wickremesinghe
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునివున్న శ్రీలంకలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన ఎలాంటి పాత్ర  పోషిస్తారు, తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. 
 
గత కొన్ని రోజులుగా శ్రీలంకలో విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. వాణిజ్యం దారుణంగా పడిపోయింది. ఆహార ఉత్పత్తి అడుగంటి పోయింది. దీంతో నిత్యావసర వస్తు ధరలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తారన్న ఆసక్తి నెలకొంది. 
 
మరోవైపు, ఈయన శ్రీలంక ప్రధానిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. యునైటెడ్ నేషనల్ పార్టీ సభ్యుడుగా ఉన్నారు. దీంతో ఆయన సొంత పార్టీలో హర్షం వ్యక్తమైంది. దీనిపై ఆ పార్టీ ఛైర్మన్ వజిర అబేవర్థనే స్పందిస్తూ, రణిల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక పార్లమెంటులో మెజార్టీ సభ్యుల మద్దతు సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, శ్రీలంకలో చెలరేగిన ప్రజాగ్రహానికి ఆ దేశ ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్సే రాజీనామా చేశారు. శ్రీలంక అధ్యక్షుడుగా ఉన్న గొటబాయి రాజపక్సే సోదరుడే మహిందా రాజపక్సే కావడం గమనార్హం.