1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 8 డిశెంబరు 2021 (14:07 IST)

అమరావతి హైకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్‌ కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి భానుమతి హైకోర్టులో  ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతులు మీదుగా ఈ కార్య‌క్ర‌మం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్ మిశ్రా కొత్త న్యాయ‌మూర్తుల‌తో ప్రమాణం చేయించారు.  
 
 
అమ‌రావ‌తిలోని మొదటి కోర్టు హాలులో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొంటున్నారు. అనంతరం సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్ మిశ్రా, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లాలతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు బెంచ్‌లలో పాల్గొని కేసులను విచారిస్తారు. 
 
 
కొత్తగా ఈ ఇద్దరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరింది. కొత్త‌గా ప్ర‌మాణం చేసిన డాక్టర్‌ కె.మన్మథరావు స్వస్థలం ప్రకాశం జిల్లా సింగరాయకొండ. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్‌, ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం, ఆంధ్రావర్సిటీ నుంచి ‘లా’లో పీహెచ్‌డీ చేశారు. 1991 జూన్‌ 25న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఒంగోలు, కందుకూరులో ప్రాక్టీసు కూడా చేశారు. 1999లో ప్రాక్టీసును హైదరాబాద్‌కు మార్చుకున్నారు. సీబీఐ, ఎక్సైజ్‌ సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, ఈడీ, డీఆర్‌ఐలకు స్పెషల్‌ పీపీగా, ప్యానల్‌ కౌన్సెల్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం వివిధ కేంద్రప్రభుత్వ శాఖలు, ఆర్థికసంస్థలు, వివిధ కంపెనీలకు స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పని చేస్తున్నారు.
 
 
మ‌రో న్యాయ‌మూర్తి బీఎస్‌ భానుమతి ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా సేవలు అందిస్తున్నారు. ఆమె స్వ‌స్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. ఆమె స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది బీకేవీ శాస్త్రి కుమార్తె. రాజమహేంద్రవరం, కొవ్వూరులో విద్యాభ్యాసం చేశారు. న్యాయవాదిగా పదేళ్లు ప్రాక్టీసు చేశారు. 2002 ఆగస్టు 21న జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వరంగల్‌, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో న్యాయసేవలు అందించారు. 2020 జూన్‌లో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఏపీ హైకోర్టులో తొలి మహిళ రిజిస్ట్రార్‌ జనరల్‌గా ఆమె గుర్తింపు పొందారు.