శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 ఆగస్టు 2021 (10:34 IST)

కాబూల్‌ ఎయిర్ పోర్టులో వాటర్ బాటిల్ ధరెంతో తెలుసా? రూ.3వేలట!

అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్‌లోకి తాలిబన్లు ప్రవేశించినది మొదలు అరాచకాలు మరింతగా పెరిగిపోయాయి. దీనిని ప్రపంచమంతా మౌనంగా గమనిస్తోంది. ముఖ్యంగా కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద అఫ్ఘాన్ పౌరులు తాలిబన్ల దుశ్చర్యలకు బలవుతున్నారు. 
 
ఈ ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇక్కడ ఉంటున్న అఫ్ఘాన్‌వాసులు, ఇతర దేశాలకు చెందినవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. తాగునీటి కోసం, ఆహారం కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
 
ఆహరం అందక కొందరు నీరసంతో సొమ్మసిల్లిపోతున్నారు. ఎయిర్ పోర్టు బయట తాగునీటిని, ఆహారాన్ని అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. నీళ్ల బాటిల్ 40 డాలర్లు(సుమారు రూ. 3వేలు), ఒక ప్లేట్ రైస్ 100 డాలర్లు (రూ.7,500)కు విక్రయిస్తున్నారు. 
 
దీనికితోడు ఇక్కడ ఆహార పదార్థాలను అప్ఘానిస్తాన్ కరెన్సీకి బదులుగా, డాలర్లలో విక్రయిస్తుండటంతో అఫ్ఘాన్‌వాసులు పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న ప్రజలకు తాలిబన్లు సాయం చేయకపోగా, వారిపై దాడులకు తెగబడుతున్నారు.