ఆదివారం, 12 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 10 అక్టోబరు 2025 (15:21 IST)

Nobel Peace Prize ట్రంప్‌కి కాదు, మరియా కొరినా మచాడోని వరించిన పురస్కారం

Maria Corina Machado
కర్టెసి-ట్విట్టర్
నోబెల్ శాంతి బహుమతి 2025 ట్రంప్ కి దక్కలేదు. ఈ పురస్కారం మరియా కొరినా మచాడోకు దక్కింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన- శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటం కోసం మరియా కొరినా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేయాలని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం నిర్ణయించింది.
 
విజేత ప్రకటన శుక్రవారం ఓస్లోలో జరిగింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రదానం చేసిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఈ సంవత్సరం 338 నామినేషన్లు వచ్చాయి. వాటిలో 244 మంది వ్యక్తులు, 94 సంస్థలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని పదే పదే చేసిన బహిరంగ ప్రకటనలతో ఆధిపత్యం చెలాయించిన ఈ సమయంలో కమిటీ వెనిజులాపై దృష్టి పెట్టడంతో మరియాకు పురస్కారం దక్కింది.
 
donald trump
నోబెల్ బహుమతి కోసం అడుక్కున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇలా ఎప్పుడైనా జరిగిందా?
తమకు తామే బహిరంగంగా నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) కావాలని అభ్యర్థించినవారు చరిత్రలో ఉన్నారా? చరిత్రలో ఎక్కడా అట్లాంటి వ్యక్తి కనబడటంలేదు. ఐతే తమకు తామే బహిరంగంగా నోబెల్ శాంతి బహుమతి కావాలని బలంగా అభ్యర్థించిన లేదా ప్రచారం చేసుకుంటున్న ప్రముఖ వ్యక్తి ఇటీవల ఉన్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కాలంటూ బహిరంగంగా, నిస్సిగ్గుగా ప్రచారం చేశారు. తన అధ్యక్ష పదవి కాలంలో, అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలలో తన పాత్ర కారణంగా తాను అనేకసార్లు బహుమతికి అర్హుడినని ఆయన పదేపదే వాదిస్తూ వచ్చారు.
 
కొన్ని దేశాల నాయకులు, ఆయన మద్దతుదారులు కూడా ఆయనకు ఈ బహుమతి ఇవ్వాలని బహిరంగంగా ప్రచారం చేశారు, నామినేట్ చేశారు. తాజాగా కొద్ది గంటల ముందు రష్యా కూడా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. అయితే, నోబెల్ బహుమతి సంప్రదాయాలకు ఈ రకమైన బహిరంగ లాబీయింగ్ విరుద్ధమైన విషయంగా చెపుతారు. ట్రంప్ నోబెల్ బహుమతి తనకు ఇవ్వాలంటూ అడగటంపై విమర్శకులు దీనిని అసాధారణమైనదిగా అభివర్ణిస్తున్నారు.
 
సాధారణంగా, నోబెల్ శాంతి బహుమతి సంస్కృతి అనేది నిరాడంబరతపై ఆధారపడి ఉంటుంది. విజేతలు తమ పనికి గుర్తింపు కోసం అసలు అడగరు. అందువల్ల, డొనాల్డ్ ట్రంప్ బహిరంగ ప్రయత్నం బహుమతి చరిత్రలో ఒక అసాధారణ ఉదాహరణగా పరిగణించబడుతుంది. కాగా నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేయబడిన లేదా గెలుచుకున్న అమెరికా అధ్యక్షులు ఇంతకుముందు కూడా ఉన్నారు. నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న నలుగురు అమెరికా అధ్యక్షులు ఉన్నారు, వీరిలో ముగ్గురు తమ పదవిలో ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని అందుకున్నారు.
 
1. థియోడోర్ రూజ్‌వెల్ట్ (Theodore Roosevelt)
సంవత్సరం: 1906
విషయం: రష్యా-జపాన్ యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వం వహించినందుకు.
స్థానం: పదవిలో ఉన్నారు.
 
2. వుడ్రో విల్సన్ (Woodrow Wilson)
సంవత్సరం: 1919
విషయం: మొదటి ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ శాంతి కోసం లీగ్ ఆఫ్ నేషన్స్‌ను స్థాపించడంలో ఆయన చేసిన కృషికి.
స్థానం: పదవిలో ఉన్నారు.
 
3. బరాక్ ఒబామా (Barack Obama)
సంవత్సరం: 2009
విషయం: అంతర్జాతీయ దౌత్యం, ప్రజల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఆయన చేసిన అసాధారణ ప్రయత్నాలకు.
స్థానం: పదవిలో ఉన్నారు (అతను పదవీ బాధ్యతలు స్వీకరించిన కేవలం తొమ్మిది నెలల తర్వాత ఈ అవార్డు వచ్చింది).
 
జిమ్మీ కార్టర్ (Jimmy Carter)
సంవత్సరం: 2002
విషయం: అంతర్జాతీయ సంఘర్షణలకు శాంతియుత పరిష్కారాలను కనుగొనడానికి ఆయన చేసిన దశాబ్దాల అవిశ్రాంత కృషికి.
స్థానం: పదవీ విరమణ చేసిన తర్వాత ఈ అవార్డును అందుకున్నారు.
 
డోనాల్డ్ ట్రంప్ విషయానికొస్తే, ఆయన తన మొదటి పదవీకాలంలో, తిరిగి ఎన్నికైన తర్వాత కూడా నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేయబడ్డారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు, పలు అరబ్ దేశాలకు మధ్య దౌత్య సంబంధాలను సాధారణీకరించిన అబ్రహం అకార్డ్స్‌లో ఆయన పాత్రకు గాను పలువురు అంతర్జాతీయ నాయకులు, రాజకీయ వ్యక్తులు ఆయనను నామినేట్ చేశారు. అలాగే, ఆయన తాను ఏడు యుద్ధాలను ముగించానని పేర్కొంటూ, అవార్డు తనకు దక్కాలని బహిరంగంగా కోరినప్పటికీ అవార్డు ఆయనకు రాలేదు.