1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:26 IST)

మేరియుపోల్‌ను వశం చేసుకున్న రష్యా సేనలు

ukraine russia war
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. గత ఫిబ్రవరి నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని కీలక నగరాల్లో ఒకటే మేరియుపోల్‌ను రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. దీంతో ఆ నగరానికి ఉక్రెయిన్ నుంచి విముక్తి లభించిందంటూ పుతిన్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో పుతిన్ జరిపిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మేరియుపోల్‌ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ విషయంలో మిమ్మల్నందరినీ అభినందిస్తున్నానని చెప్పారు. 
 
ఇక ఆ ప్రాంతంపై దాడులు చేయాల్సిన అవసరం లేదని పుతిన్ రష్యా సైన్యాధిపతికి సూచించారు. గత ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం వారం రోజుల్లోనే ఉక్రెయిన్‌ను తమ దారికి తెచ్చుకోవన్న రష్యా సైనికుల అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితంగా రష్యా అపారమైన సైనిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. 
 
ఇదిలావుంటే, మేరియుపోల్‌ను కైవసం చేసుకోవడం రష్యాకు అత్యంత కీలకం. ఎందుకంటే రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన డాన్ బాస్‌కు మధ్యలో మేరియుపోల్ ఉంది. ఇపుడు మేరియుపోల్ రష్యా వశం కావడంతో క్రిమియా, డాన్‌బాస్ మధ్య. భూమార్గంలో రాకపోకలను రష్యా సాఫీగా చేపట్టేందుకు వీలుపడుతుంది.