ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 జులై 2024 (10:37 IST)

రష్యాలో ప్రధాని మోడీ టూర్.. పాశ్చాత్య దేశాలకు అసూయ : రష్యా ప్రకటన

narendra modi
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని బాధ్యతలను చేపట్టారు. అలాగే, ఆయన ముచ్చటగా మూడోసారి రష్యా పర్యటనకు వెళుతున్నారు. ఆయన పర్యటన రష్యాలో ఈ నెల 8, 9 తేదీల్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన శిఖరాగ్ర చర్చలు జరుపుతారు. దీనిపై రష్యా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోడీ మూడోసారి రష్యాలో పర్యటనకు రానుండంతో పాశ్చాత్య దేశాలు అసూయతో చూస్తున్నాయని పేర్కొంది. మోడీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. 
 
అలాగే భారత విదేశాంగ శాఖ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య బహుళ సంబంధాలను ఇరువురు దేశాధినేతలు సమీక్షిస్తారని తెలిపింది. పరస్పర ప్రయోజనాలు, సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకుంటారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో భారత్ పేర్కొంది. 
 
రష్యాలో ప్రధాని మోడీ కార్యక్రమం విస్తృత ఉంటుందని, ఇరు దేశాల అధినేతలు చర్చలు జరుపుతారంటూ పుతిన్ ప్రెస్ సెక్రటరీ పెస్కోవ్ పేర్కొన్నారు. ఈ మేరకు రష్యా అధికార టీవీ ఛానల్ వీజీటీఆర్ కే శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రష్యా-భారత్ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించినవని అన్నారు.
 
కాగా సోమ, మంగళవారాల్లో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యాలో పర్యటించడం ఆయనకు ఇది మూడవసారి. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు భారత్-రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మోదీ వెళ్తున్నారు. మాస్కోలో జరగనున్న శిఖరాగ్ర సమావేశంలో మోదీ-పుతిన్ ప్రత్యక్షంగా చర్చలు చేపట్టనున్నారు. కాగా 2022 ఫిబ్రవరి ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.