ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తనపని మొదలెట్టిన డోనాల్డ్ ట్రంప్!!
అగ్రరాజ్యం అమెరికా దేశానికి 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అనేక కీలక అంశాలకు సంబంధించి తక్షణమే నిర్ణయాలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. తొలిరోజే ఆయన దాదాపు వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి చేతిలో అత్యంత శక్తిమంతమైన సాధనంగా పేర్కొనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ప్రాధాన్యం, వాటి అమలు గురించిన అంశాలను ఒకసారి చూద్దాం.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే.. అమెరికా చట్టసభ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అధ్యక్షుడు జారీ చేసే లిఖితపూర్వక ఆదేశాలు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ ఆదేశాలకు చట్టబద్ధత ఉంటుంది. ఇందులో ప్రభుత్వ విధానాలకు సంబంధించి అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ.. దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడికే ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ఆమోదించలేని అంశాలను తమ అజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు.
అమెరికా చరిత్రలో వేల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. జార్జ్ వాషింగ్టన్ ఎనిమిది ఆర్డర్లపై సంతకాలు చేస్తే.. ప్రాంక్లిన్ రూజ్ వెల్డ్ అత్యధిక ఆర్డర్లపై సంతకాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతల్లో 220 ఆర్డర్లపై సంతకాలు చేయగా, జో బైడెన్ తన హయాంలో 160 ఆర్డర్లపై (డిసెంబర్ 20 నాటికి) సంతకాలు చేశారు. అయితే అధ్యక్షుడు చట్టపరిధిని దాటి ఏదైనా నిర్ణయం తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంటుందని అమెరికా చట్టాలు చెబుతున్నాయి.