గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (22:58 IST)

తాలిబన్లకు లొంగిపోయే ఉద్దేశం లేదు.. ఆపద్ధర్మ అధ్యక్షుడ్ని నేనే?!

Ex-Vice President
ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు-1 అమృల్లా సలేహ్ తనను తాను ఆపద్ధర్మ దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అందరు నేతలను కలుస్తున్నానని, ఏకాభిప్రాయం దిశగా మద్దతు కూడగడుతున్నానని వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 
 
ఆఫ్ఘనిస్థాన్ రాజ్యాంగం ప్రకారం... దేశాధ్యక్షుడు పరారీలో ఉన్నా, దేశాధ్యక్షుడి గైర్హాజరీలోనూ ఉపాధ్యక్షుడు-1 దేశానికి ఆపద్ధర్మ అధ్యక్షుడు అవుతాడు. ప్రస్తుతం నేను దేశంలోనే ఉన్నాను. నేనే చట్టబద్ధమైన ఆపద్ధర్మ పాలకుడ్ని. ఈ క్రమంలో ఏకగ్రీవం దిశగా అందరినీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా అని అమృల్లా సలేహ్ వివరించారు. 
 
భవిష్యత్తులో తాను తాలిబన్లకు లొంగిపోయే ఉద్దేశం లేదని అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లాహ్‌ సలేహ్‌ ప్రకటించారు. పంజ్‌షిర్‌ లోయలోకి తాలిబన్లను రానీయకుండా తాము పోరాడతామని ఆయన ప్రకటించారు. ''నాపై నమ్మకం ఉంచి.. నా మాట వినే లక్షల మందిని నేను నిరాశపర్చను. నేను ఎప్పుడూ తాలిబన్లతో కలిసి పనిచేయను. అది ఎప్పటికీ జరగదు'' అని ఆయన ట్వీట్‌ చేశారు. 
 
ఆ తర్వాత అమ్రుల్లాహ్‌ అహ్మద్‌ షా మసూద్‌ కుమారుడితో కలిసి హెలికాప్టర్‌లో హింద్‌ కుష్‌కు వెళ్లిపోయారు. తాలిబన్లను ఎదుర్కొనేందుకు ఆయన మసూద్‌ కుమారుడితో కలిసి గెరిల్లా యుద్ధం చేసే అవకాశం ఉంది.
 
90వ దశకంలో జరిగిన యుద్ధ సమయంలో కూడా పంజ్‌షిర్‌ లోయను తాలిబన్లు ఆక్రమించలేకపోయారు. అంతకు ముందు రష్యా దురాక్రమణను కూడా ఈ లోయ తట్టుకొని నిలబడింది. ''మేము తాలిబన్లను పంజ్‌షిర్‌ ప్రాంతంలోకి అడుగు పెట్టనీయం. మా శక్తియుక్తులు ధారపోసి వారితో పోరాడతాం'' అని స్థానికులు ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు. 
 
గతంలో అమ్రుల్లా సలేహ్‌కు గెరిల్లా దళాలకు కమాండర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 1996లో తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించక ముందు ఆయన ప్రభుత్వంలో కూడా పనిచేశారు. 2001లో అమెరికా దళాలు తాలిబన్లను తరిమి కొట్టే సమయంలో సీఐఏకు సలేహ్‌ సహకరించారు.