తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్: ఇక సెక్స్ బానిసలుగా మహిళలు... అంటున్నదెవరంటే?
ఫోటో కర్టెసీ సోషల్ మీడియా
తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయింది. వారి గురించి, వారి వ్యవహారశైలి గురించి ఇప్పటికే ప్రపంచానికి కొద్దోగొప్పో తెలుసు. ప్రాణభయంతో తమ భార్యాబిడ్డలను వదిలేసి తమ ప్రాణాలను దక్కించుకనేందుకు మగవారు విమానాలు వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితిని తెలుపుతోంది.
ప్రాణభయంతో ఎలాగైనా ఆఫ్ఘన్ దేశాన్ని వీడి వచ్చేయాలని విమానాల పైకి ఎక్కేస్తున్నారు. కొందరు విమాన చక్రాలను పట్టుకుని వేలాడుతూ గగనతలంలో పట్టుతప్పి కిందపడి చనిపోయారు. ఈ దారుణ దృశ్యాలు ఇపుడు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కనబడుతున్నాయి. తాలిబన్ల చెరలో మహిళ పరిస్థితి ఎలా వుంటుందో తన ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్. తాలిబన్లు అక్కడి మహిళలను ఇండ్లలో సెక్స్ బానిసలుగా మార్చేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు.
కాబూల్‌లోని గోడపై మహిళ చిత్రాన్ని ఓ వ్యక్తి చెరిపేస్తున్న ట్విటర్ ఫోటోపై కామెంట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారనీ, మహిళలను ఎక్కడా కనిపించకుండా చేస్తారని, వారిని ఇండ్లలోనే వుంచి సెక్స్ బానిసలుగా మగ్గిపోయేలాగ పిల్లల్ని కనే యంత్రాలుగా ఉండాలని వారి భావనగా వుంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్లను అలా వదిలేస్తే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మహిళల పరిస్థితి ఎలా వుంటుందో కూడా చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేసారు.
తాలిబన్లు 1996 మరియు 2001 నుండి వారి కఠినమైన అమ్మాయిలను పని నుండి నిషేధించారు. టీవీ మరియు సంగీతాన్ని నిషేధించారు. వారు అదే నియమాలను తిరిగి అమలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు తాలిబాన్ మిలిటెంట్ల మధ్య ఘోరమైన యుద్ధం నుండి తప్పించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని షహర్-ఇ-నవ్ పార్క్‌లో ఆశ్రయం పొందిన వందలాది మంది మహిళలు తప్పిపోయారని సమాచారం వస్తోంది. వారిని తాలిబన్లు అపహరించుకుపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక ప్రావిన్స్‌ల నుండి వేలాది మంది పౌరులు తమ పట్టణాలు, గ్రామాలను విడిచి పారిపోతున్నారు. షహర్-ఇ-నవ్ పార్క్‌లో ఆశ్రయం పొందిన వందలాది మంది మహిళలు అదృశ్యమయ్యారని, గత కొద్ది రోజులుగా కుటుంబాలు వెతుకుతున్నాయి, కానీ వారు దొరకలేదని ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన ఓ పౌరుడు చెప్పాడు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు బాంబు దాడి, తుపాకీ కాల్పులు, వైమానిక దాడులు కొత్తేమీ కాదని, ఎందుకంటే వారు చిన్న వయస్సు నుండే అలవాటు పడ్డారని, అయితే వారు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదని అతడు చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో యువత జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉంటుందన్నాడు.
ముఖ్యంగా యువతులు. తాలిబాన్ మిలిటెంట్లు ఇళ్లలోకి చొరబడతారు. వారు యువతులను బలవంతంగా తీసుకెళ్తారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇది జరుగుతోంది కానీ ప్రభుత్వం మౌనంగా ఉందని ఆయన చెప్పారు. షహర్-ఇ-నవ్ పార్క్ నుండి వందలాది మంది యువతులు అకస్మాత్తుగా తప్పిపోతే ఎవరు బాధ్యత వహించాలి? అంటూ అతడు ఆవేదన వ్యక్తం చేసాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల భవిష్యత్తు నాశనమైపోతోందనీ, ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడు తాలిబాన్లకు దేశాన్ని అప్పగించి పారిపోతే, ఇప్పుడు అక్కడి ప్రజల గతి ఏమిటి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసాడు.