శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (18:43 IST)

'శాతకర్ణి'తో తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్లతో తవ్వకాలు చేస్తోంది... బాలయ్య ఇంటర్వ్యూ

పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఇమిడిపోయేలా వారసత్వంగా పుణికిపుచ్చుకున్నాననీ, అందులో భాగంగానే శాతకర్ణి పాత్ర లభించిందని... బాలకృష్ణ అన్నారు. నా ఆంగికాన్ని, ఆహార్యాన్ని, వాచకాన్ని దృష్టిలో పెట్టుకుని కథలు

పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఇమిడిపోయేలా వారసత్వంగా పుణికిపుచ్చుకున్నాననీ, అందులో భాగంగానే శాతకర్ణి పాత్ర లభించిందని... బాలకృష్ణ అన్నారు. నా ఆంగికాన్ని, ఆహార్యాన్ని, వాచకాన్ని దృష్టిలో పెట్టుకుని కథలు చెబుతారని.. కొన్ని కథలకు తననే దర్శకత్వం చేయమని చాలామంది అడిగారు.. నా మనస్సుకు నచ్చితే దర్శకత్వం కూడా చేస్తానని తెలియజేశారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం విడుదల తర్వాత లభించిన ఆదరణకు ఆయన ఆనందం వ్యక్తంచేశారు. ఈరోజే విదేశాలకు బయలుదేరి అక్కడ విజయయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారంనాడు ఆయన తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఏదో అద్భుతం జరగబోతోందని ప్రజల్లో ఫీలింగ్‌ కలగచేసిన మీడియాను ముందుగా అభినందించారు.
 
తెలుగువాళ్ళంతా చూడాల్సిన సినిమా అన్నారు...?
తెలుగు వారే కాదు. ఇతర భాషలవారు చూసేలా ప్రమోట్‌ చేస్తాం. బీహార్‌, కాశ్మీర్‌ తప్ప మిగతా అంతా పాలించిన రాజు చిత్రం ఇది. కొన్ని భాషల్లో డబ్బింగ్‌ చేసి సబ్‌టైటిల్స్‌తో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం.
 
సినిమా ప్రభావం తెలంగాణ ప్రభుత్వంపై పడిందే?
అవును. తెలంగాణ ప్రభుత్వం 2 కోట్లను వెచ్చించి కోటిలింగాల వద్ద తవ్వకాలు ప్రారంభించింది.
 
కెసిఆర్‌ సినిమాను చూశారా?
ఇంకా చూడలేదు. అసెంబ్లీ అయ్యాక చూస్తానన్నారు.
 
ఈ పాత్రను మీ నాన్నగారు చేయలేకపోయారు.. దీనిపై మీరెలాంటి కృషి పెట్టారు?
ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నందుకు కృతజ్ఞతలు. ఇది తెలుసుకోవాల్సిన చరిత్ర. కృష్ణదేవరాయలు, చంద్రగుప్తులు వంటివారు మనవాళ్ళకు తెలుసు. వారికి ముందు వచ్చినవారే శాతవాహనులు. నాన్నగారున్నప్పుడే 'అశోకచక్రవర్తి' గురించి తీస్తానన్నా. చేసుకో అన్నారు. స్క్రిప్ట్‌ కూడా పకడ్బందీగా ఆయనే చేశారు. ఆ తర్వాత మళ్ళీ పిలిచారు. బుద్ధుడు నేను చేస్తా. అశోకుడిగా నువ్వు చేయి అన్నారు. సరే అన్నాను. ఆ తర్వాత అశోకుడు చరిత్ర చాంతాడంత వుంది. దాన్ని జనరంజకంగా మార్చాలి అన్నారు. ఇలా.. ఒక్కో సినిమాను చేయాలంటే దానికి ఎంతో హోమ్‌వర్క్‌ చేయాల్సి వుంటుంది. పాత్రలు, వారి వేషధారణ, భాష.. పరివిధిలా ఆలోచిస్తూ ప్రేక్షకులు ఆమోదిస్తారా! లేదా! అనేది కూడా చూసుకుంటాం. కొడుకుగా నాన్నగారు చేయాలనుకుని చేయలేని పాత్ర నేనే చేయడం పూర్వజన్మ సుకృతం.
 
100వ సినిమా కాబట్టి ఇంత హైప్‌ వచ్చిందా?
అన్నీ అనుకూలించాయి. ఒక్కొరికి ఒక్కో మైలురాయి లాంటి సినిమా చేయాలనుంటుంది. నాకూ అది కూడా ఓ కారణం. మంచి స్క్రిప్ట్‌ ఎంచుకున్నాను. ఇంకో సినిమా గురించి ఆలోచిస్తుంటే.. ఈ కథతో నిర్మాతలు రావడం.. తెలీని చరిత్ర.. అమరావతి రాజధానిగా అభివృద్ధి కావడం.. నాన్నగారు చేయాల్సిన పాత్ర.. ఇవన్నీ గుర్తుకువచ్చి చేసేలా ప్రేరేపించాయి.
 
శాతకర్ణి కథను ఎన్‌టిఆర్‌గారు చేయడానికి కొంత పరిశోధన చేశారుగదా?
అవును. అప్పట్లో కొందరితో సంప్రదించారు. హైదరాబాద్‌లో వుండే ప్రదీప్‌, ముంబైలో యాడ్‌ ఫిలింస్‌ చేసే ప్రసాద్‌గారితో సంప్రదించారని తెలిసింది. అదికూడా ఆయన దర్శకత్వంలోనే చేయాలనుకున్నారు. కానీ పూర్తి కథ లభ్యంకాలేదు. అప్పట్లో  ఆ వంశీయులు వేయించిన శాసనాల్లో కాస్ట్యూమ్స్‌, ఆభరణాలు పరిశీలించారు. ఆరోజుల్లో కిరీటాలు లేవు. అందుకే పట్టాభిషేకం సందర్భం చేసే హోమంలో తలకు కట్టులాంటిది కట్టాను.

వేరే సినిమా అనుకుని ఈ కథ రాగానే.. దానికి వనరులు తక్కువ సమయంలో ఎలా సమకూర్చుకున్నారు?
దర్శకనిర్మాతలు చాలా నమ్మకంతో నా వద్దకు వచ్చారు. అప్పుడే సంక్రాంతికి వచ్చేయాలని అన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గ్రాఫిక్స్‌ వారితో కూడా మాట్లాడేశారు. వారిలో వున్న పట్టుదల నన్ను ఆకట్టుకుంది.
 
క్రిష్‌ సినిమాలు చూశారా?
'కంచె' సినిమా చూశాను. చాలా బాగుంది.
 
కథ చెబుతున్నప్పుడే ఇన్‌పుట్స్‌ ఇచ్చారా?
కథ కూడా మూడు ముక్కల్లో... కట్టె కొట్టె తెచ్చే అన్నట్లు చెప్పేశారు. తన సైన్యాన్ని నలుదిక్కుల నడిపిన యోధానుయోధుడు, తెలుగు పౌరుషం, అసమానశూరుడని చెప్పారు. తల్లిపేరు పెట్టుకుని రాజు నుంచి చక్రవర్తి అయ్యాడనే విషయాలే చెప్పారు. పెద్దగా ఇన్‌పుట్స్‌ ఇవ్వలేదు.
 
జార్జియాలో 14 గంటలు గుర్రాలపై వున్నారట?
అవును. పాత్ర మీదుండే తపన అలా చేయించింది. నటన అంటే ఏడవడం, నవ్వడం, కేకలు వేయడం కాదు. ఒకరి ఆత్మలో మనం వెళుతున్నాం. ముందు మనం పరిచయం చేసుకోవాలి. తర్వాత పాత్రలో ప్రవేశించాలి. నాన్నగారి ఆశీస్సులు, శాతకర్ణి దీవెనలే నన్ను అలా నడిపించాయి. షూటింగ్‌లో మూడు రోజులు సరదాగా వుండి.. అక్కడివారినంతా ఒక మూడ్‌లోకి తీసుకువస్తా. నేను ఏ చిత్రాలు చేసినా అంతే.. అలానే 14 రోజులు గుర్రాలతో ఫైట్‌ చేయాల్సివస్తే.. ఆ మూడ్‌లోకి వెళ్ళిపోయానంతే.
 
ఇలాంటి పాత్రలకు మీ ప్రిపరేషన్‌ ఎలా వుంటుంది?
ఏ పాత్రకైనా ఒక్కటే ప్రిపరేషన్‌. అయితే ఈ పాత్రకు వ్యాయామం చేశాను. అలా అని సిక్స్‌ప్యాక్‌ లాంటివి కాదు. అసలు అది మన నేటివిటీకాదు. చొక్కా విప్పి చూపిస్తే చూసేవారెవ్వరూ వుండరిక్కడ. అవి కొంతమందికే సరిపోతాయి. మన తెలుగువాడు కోడిరామ్మూర్తి.. దిట్టంగా, ధృడంగా వుండేవారాయన. అలాగే మన నేటివిటీకి తగినట్లు పాత్రలు వస్తే బాడీ ఆటోమేటిక్‌గా మారిపోతుంది. నాన్నగారు దుర్యోధనుడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా భిన్నమైన పాత్రలు వేసి బాడీని మార్చేశారు. ఆయన్ను చూసి నేర్చుకున్నాను. అది వారసత్వంగా నాకూ వచ్చేసింది. పైగా పాత్ర వేసుకున్న వస్త్రధారణ, ఆభరణాలు, లొకేషన్‌, సన్నివేశాలు, చుట్టూ నటీనటుల ప్రభావం పాత్రపై పడుతుంది.
 
మీరు ముందురోజు స్క్రిప్ట్‌ తెప్పించుకుంటారా?
నేను అడగను. దర్శకుడే పంపేవారు. నాన్నగారి స్కూల్‌ అంతే. అదికూడా స్వంత సినిమా అయితేనే. మిగిలిన సినిమాలకు అడగరు. 'బొబ్బిలిపులి' వంటి చిత్రాల్లో పెద్దపెద్ద సీన్లు, పతాక సన్నివేశం డైలాగ్స్‌లు వుంటే తెప్పించుకుంటారు. ఆయన్ను ఫాలో అవుతానంతే.
 
'శాతకర్ణి' ఇంత సక్సెస్‌ సాధిస్తుందని అనుకున్నారా?
ముందుగా అనుకున్నాం. వందవ సినిమా, టీమ్‌ వర్క్‌ నమ్మకం ఈ విజయానికి దోహదపడ్డాయి.
 
చారిత్రక, పౌరాణిక చిత్రాలు చేయాలంటే ధైర్యమున్న దర్శకుడు క్రిష్‌ వచ్చాడని అనిపించిందా?
క్రిష్‌గారి 'కంచె' చూశాక అనిపించింది. మంచి చిత్రం తీయగలడని. నేను 'నర్తనశాల'ను కూడా అలాగే ఎన్నుకున్నా. నవరసాలున్న కథ అది. అలాంటి దర్శకుడు క్రిష్‌ కూడా. నాన్నగారు 'కర్ణ' తీశారు. ఆయన తప్ప ఎవ్వరూ చేయలేరు. నా దగ్గరకు వచ్చి కొన్ని కథలు కొందరు చెబుతారు. తర్వాత పూర్తి స్క్రిప్ట్‌ నేను చెప్పేస్తా. అది విన్నాక మీరే దర్శకత్వం చేస్తే బాగుంటుందని చాలామంది అన్నారు. అయితే అలా చేయాలంటే నాలో ఆవేశం రావాలి. వస్తే తప్పకుండా దర్శకత్వం చేస్తా. 
 
నర్తనశాల తిరిగి ప్రారంభిస్తారా?
తెలీదు. చెప్పలేను కూడా. ఎందుకంటే కొందరు ఆర్టిస్టులు లేరు. సౌందర్య లేరు. ఆ పాత్రకు వేరేవారిని ఊహించుకుకోలేను. అలాగే భీముడు పాత్రకు శ్రీహరి సరిపోయాడు. పాత్రలను బట్టి ఆహార్యం ఒప్పుకోలుగా కన్పించాలి. నా ఊహకు తగినవారు తగిలితే తప్ప అది మరలా ప్రారంభించలేం.
 
సోషల్‌ మీడియా ద్వారా ఇండస్ట్రీలో చాలామందితో పాటు తోటి ఆర్టిస్టులు కూడా బాగుందని ట్వీట్‌ చేశారు. ఇదివరకు ఇలా జరగలేదు ఎందుకని?
అందరూ స్వంతం చేసుకున్నారు. నిజమైన సినిమాకు భాషాభేదం లేదు. ఉత్తరాదిలో కొన్నిచోట్ల విడుదల చేశాం. దాన్ని వారు ఓన్‌ చేసుకున్నారు. ఇక్కడ అభిమానులు, దురభిమానులు అనే అడ్డుగోడల్లేవు. ఒకరకంగా ఇది ఇండస్ట్రీ సక్సెస్‌ కూడా.
 
ఇతర నటులతో మీ సంబంధాలు ఎలా వుంటాయి?
పెద్దగా ఎవ్వరితో మాట్లాడను. ఏదైనా ఫంక్షన్‌లో కన్పిస్తే మాట్లాడతాను. కారణం సమయం వుండదు. శాసనసభ్యుడిగా నియోజకవర్గ పనులు, కేన్సర్‌ ఆసుపత్రి చూసుకోవడం, సినిమాలపై దృష్టి పెట్టడంతోనే సమయం సరిపోతుంది. తదుపరి రైతు సినిమా చేయాలి. దాన్ని కమర్షియల్‌గా ఎలా చేయాలి. తెలంగాణ శ్లాంగ్‌లో ఎలా మాట్లాడాలి. వాటిపైనే కృషి చేస్తుంటాను. ప్రతీదీ క్షుణ్ణంగా పరిశీలించాకే సెట్‌పైకి వస్తా. ఇలా సినిమాపై కూర్చుంటే దానికి కేటాయిస్తా.

'రైతు'లో అమితాబ్‌ చేస్తారా?
చేస్తారు. 'శాతకర్ణి' సినిమాను కూడా చూపించి ఒప్పించి చేయిస్తాం. ఆయన్ను గతంలో కలిశాం. 'సర్కార్‌' అయ్యాక చూద్దాం అన్నారు. ఆయన లేకపోతే సినిమా లేదు. ఆయన ప్రెసిడెంట్‌ పాత్ర చేయాలి. ఆ పాత్రకు వారే సరిపోతారని ఊహించి ఎంపిక చేశాం. ఓసారి హైదరాబాద్‌ వచ్చి ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. తెలుగులో నటించాలనుంది. వెయ్యిమందిలో నిలబడి వున్న పాత్ర అయినా సరే చేయాలనుకున్నాం అన్నారు. అందుకే ఒక్కడిగా వుండే ఉన్నతమైన పాత్ర ఆయన చేత చేయించాలనుకున్నాం. 
 
మల్టీస్టార్‌తో చేస్తారా?
మంచి కథతో ముందుకురాబోతున్నాం. పౌరాణికం వుంది. ఎవరు నటిస్తున్నారనేది పేరు చెప్పను. అన్ని విషయాలు తర్వాతే చెబుతా.
 
'దంగల్‌' వంటి కథలు మీ నుంచి ఆశించవచ్చా?
కొన్ని మన నేటివిటీకి తగవు. నేను రొమాంటిక్‌ హీరో కాదు. ఆమధ్య సల్మాన్‌ నటించిన 'సుల్తాన్‌' చూశాను. ఏదైనా మన పాత్రలు మన కల్చర్‌ వేరేగా వుంటాయి. అన్నీ చేయలేం.
 
'శాతకర్ణి'లో రెండు తొడలు కొట్టేది మీ క్రియేషనా?
అది దర్శకుడిదే. ఎడిటింగ్‌లో అది లేదు. నేను చూసి.. మొత్తం షాట్‌ లేదేంటి అన్నా. దానికి ఆయన వెంటనే రియాక్ట్‌ అయి.. సీన్‌ చూశాక.. వుండాలి.. వుంటే బాగుంటుందని ఆయనే పెట్టారు.
 
101వ సినిమా ఎప్పుడు?
ఇంకా ఏమీ అనుకోలేదు.
 
దర్శకత్వం చేస్తారా?
ఇందాకే చెప్పినట్లు.. దర్శకుడు నా ఊహల స్థాయికి చేరుకోలేకపోతున్నారంటే తప్పకుండా చేస్తా.
 
ప్రొడక్షన్‌ ప్రారంభిస్తారా?
త్వరలో ఆరంభిస్తాను. ఈ ఏడాదిలోనే.
 
మోక్షజ్ఞ ఎంట్రీ?
ఏడాది చివరల్లో వుంటుంది.
 
ఈ సినిమా చూశాడా?
చూసి చాలా బాగుందన్నాడు. ఇంట్లోవారందరికీ నచ్చింది కూడా. ముఖ్యంగా నిడివి వారు చూడగలిగేలా వుంది.
 
సంభాషణలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా?
నాకే అలా కుదురుతున్నాయంతే. ఆ రోజుల్లో నాన్నగారు, రంగారావు, సముద్రాల జూనియర్‌, కొసరాజు వంటివారు రాసేటప్పుడు వారి డిక్షన్‌ చాలా సులువుగా వుండేది. ఎక్కువగా ఆలోచించేవారుకాదు. వెంటనే మాటలు తూటాల్లా వచ్చేసేవి. ఏదిఏమైనా దేన్నీ మనం పిచ్చిగా ప్రేమించకూడదు. తపన మాత్రం వుండాలి. 'నర్తనశాల' చేస్తున్నప్పుడు కమలాకరకామేశ్వరరావుగారి దగ్గర పనిచేసిన పెద్దాయన్ను రచయితగా పెట్టుకున్నా. 
 
ఆయన మొత్తం చదివాక.. బాబూ.. ఈ సీన్‌లో రెండు పేజీలు అనవసరంగా వున్నాయని చెప్పారు.. మీకు నచ్చలేదా.. అయితే చింపేయండి! అన్నా. అందులో ఏ డైలాగ్‌లు వున్నాయి.. అనేవి కూడా నాకు చెప్పవద్దన్నాను. ఆ రెండు పేజీలవల్లే సినిమా ఆడదుకదా. పాత్రను ప్రేమించు.. కానీ పిచ్చిగా మాత్రం వద్దనేది నా పాలసీ.
 
దర్శకుడు మీ వద్దకే కథతో వచ్చినప్పుడు ఎలా అనిపించింది?
మంచి కథ. గెటప్‌ నన్ను బాగా ఆకట్టుకుంది. నన్ను నమ్మి నేను సరిపోతానని వచ్చారు. వెంటనే పట్టేసుకున్నా. కథ మన దేశానికి మన రాష్ట్రానిది. 
 
చరిత్రపై రకరకాలుగా స్పందిస్తున్నారు?
పూర్తి చరిత్ర ఎవ్వరికీ తెలీదు. దేశ చరిత్ర తీసుకుంటే.. ఆర్యులనేవారు బయటనుంచి రాలేదు. అదంతా అబద్ధమని ఓ ఆంగ్ల శాస్త్రజ్ఞుడు చెప్పాడు. చివరికి ఆయన శాస్త్రిగా తన పేరును కూడా మార్చుకున్నాడు. దేశమంతా గణరాజ్యాలుగా వుండేవనీ.. అప్పట్లో ట్రైబల్‌ వాతావరణం వుండేదనీ.. క్రమేణా మారిందని వుంది.
 
మోక్షజ్ఞను మీ బేనర్‌లో పరిచయం చేస్తారా?
ఏదీ ప్లాన్‌గా అనుకోను. రేపు మంచి దినం ముహూర్తం చేయాలని మనస్సులో తడితే వెంటనే కెమెరా ముందుకు తీసుకువస్తాను. ఏదైనా వేడివేడిగా తీసుకువస్తాను.
 
చిరంజీవి, మీ సినిమా ఒకేసారి పోటీకి వచ్చాయి? బయట చాలా చర్చ జరిగింది?
ఏదైనా.. స్పర్దే వర్ధతే విద్య అంటారు.. ఏ రంగంలో అయినా అలా వుండాలి. లేదంటే మజా వుండదు. అది సహజం. పర్సనల్‌గా మేమిద్దరం చాలా క్లోజ్‌గా వుంటాం. ఇండస్ట్రీలో ఆయనతో తప్పితే ఎవ్వరితో అంత క్లోజ్‌గా వుండను. ఒకరకంగా పోటీ మంచిదే. ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాం.
 
మోక్షజ్ఞను లవర్‌బాయ్‌గా చూపిస్తారా?
నా ఫ్యాన్స్‌ ఒప్పుకోరు. వయస్సును బట్టి ఓకే అంటే.. చూద్దాం.. ఏదైనా సినిమాను బట్టి వుంటుంది.
 
ప్రస్తుతం తనేం చేస్తున్నాడు?
ఈ సినిమాకు అసిస్టెంట్‌గా కొన్నిరోజులు చేశాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బి.బి.ఎ. కోర్సు చేస్తున్నాడు. నటుడిగా కొంత శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. నాన్నగారిని చూసి నేను ఎలా నేర్చుకున్నానో వాడు అంతే. ప్రత్యేకంగా ఇలా వుండు.. అలా వుండు అని చెప్పను.
 
బయట మీరు సీరియస్‌గా వుంటారని అంటారు. ఇంట్లో కూడా అలానే వుంటారా?
నేను ఇంట్లోనూ సరదాగానే వుంటాను. నేను చేసిన పాత్రల వల్లనేమో బయట అలా భావిస్తుంటారు. నాన్నగారిని చూడగానే లేచి నిలబడేవారు. అది ఆయన పాత్రల ప్రభావం. ఇంట్లో నేను చాలా కలివిడిగా వుంటాను. జోక్‌లు వేస్తుంటాను. 
 
కథను ఏ ప్రాతిపదికన అంగీకరిస్తారు?
దానికి రకరకాల కారణాలుంటాయి. కొన్ని పాయింట్‌తోనే కథను అల్లేస్తారు. పాయింట్‌ వల్ల పాత్ర తయారవుతుంది. దాని చుట్టూ అల్లుకోవడమే సినిమా. ఆమధ్య 'పెద్దన్నయ్య' సినిమాకు నేనే కథ రాశాను. దాన్ని పరుచూరి బ్రదర్స్‌ అల్లారు. ఏదైనా పాయింట్‌, కథ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. కథ వుంటే దాన్నిబట్టే పాత్ర వుంటుంది. రౌడీ అల్లుడు, లారీ డ్రైవర్‌ చిత్రాల్లో కథ వుండదు. ఓ పాత్ర వుంటుంది. దాని చుట్టూ అల్లిన సన్నివేశాలే వుంటాయి. ఇదే వ్యత్యాసం. 
 
తెలుగువారికి ఏమి చెప్పబోతున్నారు?
20, 30 ఏళ్ళుగా సినిమాలు చూడనివారు ఈ సినిమాను మనవళ్ళతో వస్తుంటే తరాలను ఏకం చేసిందనిపిస్తుంది. అనిర్వచనీయమై అనుభూతి పొందుతున్నాను. 
 
శ్రియను తదుపరి సినిమాలో తీసుకుంటానని అన్నారట?
లేదు. పాత్రను బట్టే వుంటుంది. ఈ మధ్య ఇంటర్వ్యూలో ఫైట్‌ మాస్టర్‌తో.. నా చేత ఫైట్స్‌ చేయించలేదని అడిగింది. దాన్ని ఏదో సినిమాలో వచ్చేలా చేద్దామని అన్నాను అంతే.
 
హేమామాలినితో నటించినప్పుడు నాన్నగారితో నటించిన పాత విషయాలు షేర్‌ చేసుకున్నారా?
పెద్దగా లేదు. శ్రీకృష్ణ విజయంలో ఓ పాట చేసింది. తర్వాత ఓ సినిమాలో చేయమని అడిగితే.. డేట్స్‌ కుదరక చేయలేకపోయింది.
 
చంద్రగుప్తుడిగా ఎన్‌టిఆర్‌, శాతకర్ణిగా మీరు చేయడం ఎలా ఫీలవుతున్నారు?
(నవ్వుతూ) ఇక్కడ ప్రత్యేకత ఏమంటే.. చంద్రపుగ్తుపుడు పాత్రలో నాన్నగారు ఉత్తరాది నుంచి దక్షిణాదిని కొట్టుకుంటూ వచ్చారు. ఇందులో నేను దక్షిణాది నుంచి ఉత్తరాదిని కొట్టుకుంటూ పోయా. మేమిద్దరమే దేశాన్ని కొట్టేశాం.
 
ఆదిత్య 999 వుంటుందా?
బ్రహ్మాండంగా స్క్రిప్ట్‌ వచ్చింది. అయితే ఫుల్‌ స్క్రిప్ట్‌ చేయలేదు. కాన్సెప్ట్‌ చాలా బాగుంది. నేను, మోక్షజ్ఞ కలిసి చేయగలిగే సినిమా ఇది. కథ ప్రకారమే తను నటించడానికి అవకాశముంది.
 
ఎస్‌వి కృష్ణారెడ్డి ఓ కథతో వచ్చారని తెలిసింది?
అటువంటిది లేదు అని చెప్పారు.